Turkey: ఒకేరోజు మూడు భూకంపాలు... టర్కీ, సిరియాలో 2,300 దాటిన మృతుల సంఖ్య
- టర్కీ, సిరియాలను కుదిపేసిన శక్తిమంతమైన భూకంపాలు
- వేలాది భవనాలు నేలమట్టం
- టర్కీలో 1100కి పైగా మరణాలు
- సిరియాలోనూ పెరుగుతున్న మృతుల సంఖ్య
- సహాయక బృందాలను పంపిస్తున్న యూరోపియన్ యూనియన్
టర్కీ, సిరియా దేశాల్లో నేడు పెను విషాదం నెలకొంది. ఒకే రోజు సంభవించిన మూడు భారీ భూకంపాలతో టర్కీ, సిరియా దేశాలు విలవిల్లాడాయి. వేలాది భవనాలు నేలమట్టం కాగా, తప్పించుకునే వీల్లేక భారీ సంఖ్యలో మృత్యువాతపడ్డారు.
ఈ వరుస భూకంపాల ధాటికి ఈ రెండు దేశాల్లో 2,300 మందికి పైగా మరణించారు. టర్కీలో 1,121 మంది మరణించారని... 5,385 మంది గాయపడ్డారని టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్ వెల్లడించారు.
అటు, సిరియాలో 800 మందికి పైగా ప్రాణాలు విడిచారు. కాగా, టర్కీ, సిరియా దేశాలు భూకంపాలతో దయనీయ స్థితిలో చిక్కుకోవడం పట్ల భారత్ తో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా స్పందించాయి.
తీవ్రంగా నష్టపోయిన టర్కీకి సాయం చేసేందుకు నెదర్లాండ్స్, రొమేనియా వంటి యూరప్ దేశాలు సహాయక బృందాలను పంపాయి. మరింత సాయం అందించేందుకు ఈయూ సంసిద్ధత వ్యక్తం చేసింది.