Virat Kohli: కోహ్లీని ఊరిస్తున్న మూడు రికార్డులు.. ఆసీస్ సిరీస్‌లో బద్దలుగొట్టేస్తాడా?

3 records that Kohli can break in the upcoming series against Australia
  • ఈ నెల 9 నుంచి భారత్-ఆసీస్ మధ్య తొలి టెస్టు
  • అత్యంత అరుదైన రికార్డులకు చేరువలో కింగ్ కోహ్లీ
  • గవాస్కర్, సెహ్వాగ్, సచిన్ రికార్డులను బద్దలుగొట్టే చాన్స్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఈ నెల 9న నాగ్‌పూర్‌లో భారత్-ఆసీస్ మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీకి ఈ సిరీస్ చాలా కీలకం కానుంది. అంతేకాదు, శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్‌ ఈ సిరీస్‌కు దూరం కావడంతో మిడిలార్డర్‌లో కోహ్లీ తలపై పెద్ద బాధ్యతే ఉంది.  ఆసియా కప్ తర్వాత ఫామ్‌లోకి వచ్చిన కోహ్లీ అద్భుతమైన ఆటతీరుతో మునుపటి కోహ్లీని తలపిస్తున్నాడు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఆరు వన్డేల్లో 67.6 సగటుతో 338 పరుగులుచేశాడు. ఇప్పుడు రెడ్‌బాల్ క్రికెట్‌లోనూ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. అందుకు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నాడు. ప్రస్తుతం కోహ్లీని మూడు రికార్డులు ఊరిస్తున్నాయి.  అవేంటో చూద్దాం!

ఆస్ట్రేలియాపై అత్యధిక టెస్టు సెంచరీల రికార్డు
ఆస్ట్రేలియాపై కోహ్లీ చివరిసారి 2018లో సెంచరీ  సాధించాడు. పెర్త్‌లో జరిగిన ఆ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 123 పరుగులు చేశాడు. ఇప్పుడు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కనుక రెండు సెంచరీలు సాధిస్తే దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ రికార్డు బద్దలవుతుంది. ఆస్ట్రేలియాపై అత్యధిక సెంచరీలు సాధించిన రెండో భారత ఆటగాడిగా కోహ్లీ రికార్డులకెక్కుతాడు. ఆస్ట్రేలియాపై కోహ్లీ ఇప్పటి వరకు 20 మ్యాచుల్లో ఏడు సెంచరీలు సాధించాడు. గవాస్కర్ 20 మ్యాచుల్లో 8 సెంచరీల సాధించాడు. 

టాప్-5 ఆటగాళ్ల జాబితాలో చోటు 

ఈ సిరీస్ ద్వారా కోహ్లీ మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకునే అవకాశం ఉంది. అత్యధిక టెస్టు పరుగులు సాధించిన టీమిండియా ఆటగాళ్లలో 8,119 పరుగులతో కోహ్లీ ప్రస్తుతం ఆరో స్థానంలో ఉన్నాడు. ఈ సిరీస్‌లో కనీసం 391 పరుగులు సాధిస్తే వీరేంద్ర సెహ్వాగ్ (8,503 పరుగులు) రికార్డును అధిగమిస్తాడు. ఫలితంగా అత్యధిక టెస్టు పరుగులు సాధించిన ఐదో ఆటగాడు అవుతాడు. 

అత్యంత వేగంగా 25 వేల పరుగులు సాధించిన ఆటగాడిగా.. 
టీమిండియా మాజీ సారథిని మరో అద్భుతమైన రికార్డు ఊరిస్తోంది. కోహ్లీ ఇప్పటి వరకు అన్ని ఫార్మాట్లలో కలిపి 24,936 పరుగులు సాధించాడు. టెస్టుల్లో 8,119, వన్డేల్లో 12,809, టీ20ల్లో 4008 పరుగులు సాధించాడు. మొత్తం 546 ఇన్నింగ్స్‌లలో కోహ్లీ ఈ ఘనత సాధించాడు. ఈ సిరీస్‌లో ఈ ఢిల్లీ ఆటగాడు మరో 64 పరుగులు సాధిస్తే 25 వేల పరుగులు సాధించిన రెండో ఇండియన్‌గా, ఓవరాల్‌గా ఆరో క్రికెటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. అంతేకాదు, అత్యంత వేగంగా ఆ ఘనత సాధించిన క్రికెటర్‌గానూ రికార్డులకెక్కుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు సచిన్ పేరిట ఉంది. టెండూల్కర్ 576 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించాడు.
Virat Kohli
Sachin Tendulkar
Sunil Gavaskar
Virender Sehwag
Border-Gavaskar Trophy
Australia

More Telugu News