Rishabh Pant: రిషభ్ పంత్ ను చెంపదెబ్బ కొట్టాలని ఉందన్న లెజండరీ క్రికెటర్

As Rishabh Pant Recovers In Hospital Why Kapil Dev Wants To Slap Him
  • పంత్ పై పుత్రవాత్సల్యం చూపిన కపిల్ దేవ్
  • అతడు జట్టులో లేకపోవడంతో టీమిండియా బలం తగ్గిందని వ్యాఖ్య 
  • పిల్లల్ని తల్లిదండ్రులు మందలించినట్లే, అతడిని కొట్టాలని ఉందని వ్యాఖ్య
  • ప్రపంచంలోని ప్రేమనంతా పంత్ పొందాలని ఆకాంక్ష
ఇటీవల జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. శస్త్రచికిత్సలు చేయించుకున్న అతడు పూర్తిగా కోలుకుని, తిరిగి మైదానంలో అడుగుపెట్టాలంటే కనీసం 6 నెలల నుంచి ఏడాది పట్టే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో రిషభ్ పంత్ గురించి ఇండియన్ క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పంత్ పూర్తిగా కోలుకోగానే.. అతడిని చెంప దెబ్బ కొట్టాలని ఉందని చెప్పారు. ‘అన్ కట్’ చానల్ తో మాట్లాడిన కపిల్..  పంత్ లేకపోవడంతో టీమిండియా బలం తగ్గిందని అన్నారు.

‘‘పంత్ పై నాకు ఎంతో ప్రేమ ఉంది. అతడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. అప్పుడు వెళ్లి చెంప దెబ్బ కొడతాను. జాగ్రత్తగా ఉండమని చెబుతాను. ‘నువ్వు లేకపోవడంతో జట్టు బలం తగ్గింది’ అని చెబుతాను. అతడిని ఎంతో అభిమానిస్తున్నాను. అదే సమయంలో కోపంగానూ ఉన్నాను. నేటి యువకులు ఎందుకు అలాంటి తప్పులు చేస్తున్నారు? వారికి చెంప దెబ్బలు పడాలి’’ అని కపిల్ అన్నారు.

‘‘ అతను ప్రపంచంలోని ప్రేమనంతా పొందాలి. దేవుడు అతనికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలి. పిల్లలు తప్పు చేస్తే చెంపదెబ్బ కొట్టే హక్కు తల్లిదండ్రులకు ఉన్నట్లుగానే.. నేను పంత్ ను చెంపదెబ్బ కొట్టాలని అనుకుంటున్నా’’ అని చెప్పారు..
Rishabh Pant
Kapil Dev
slap
Cricket
border gavaskar trophy
Team India

More Telugu News