Narendra Modi: లోక్ సభలో విపక్షాలపై సెటైర్లు వేసిన ప్రధాని మోదీ

PM Modi fires on opposition in Lok Sabha

  • రాష్ట్రపతిని సైతం అగౌరవపరిచేలా కొందరు మాట్లాడుతున్నారన్న ప్రధాని
  • బీజేపీ పాలనపై ప్రజల్లో నమ్మకం బలపడిందని వ్యాఖ్య
  • శ్రీనగర్ లో సైతం మువ్వన్నెల జెండా ఇప్పుడు ఎగురుతోందన్న మోదీ

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోదీ మాట్లాడుతూ విపక్షాలను టార్గెట్ చేశారు. ఆదివాసీ సమాజానికి చెందిన ద్రౌపది ముర్ముకు దేశ ప్రథమ మహిళగా గొప్ప గౌరవం దక్కిందని... దేశ అధినేతగా భారత మహిళలకు ఆమె స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని మోదీ కొనియాడారు. ప్రథమ పౌరురాలిని అగౌరవపరిచేలా కొందరు నేతలు పెద్దపెద్ద మాటలు మాట్లాడారంటూ రాహుల్ గాంధీని, కాంగ్రెస్ ను ఉద్దేశిస్తూ పరోక్ష విమర్శలు గుప్పించారు. రాష్ట్రపతి ప్రసంగానికి హాజరు కాకుండా ఆమెను అగౌరవించారని మండిపడ్డారు. వారి స్వభావమే అంత అన్న ప్రధాని... వారిలోని విద్వేషం బయటపడిందని చెప్పారు. 

2004 నుంచి 2014 వరకు యూపీఏ హయాంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉగ్రవాదులు విధ్వంసాన్ని సృష్టించారని... ఎక్కడ చూసినా హింస కనిపించిందని మోదీ అన్నారు. యూపీఏ హయాంలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో జరిగిన అవినీతి వల్ల దేశ ప్రతిష్ట మసకబారిందని చెప్పారు. ప్రతి అవకాశాన్ని కాంగ్రెస్ సంక్షోభంగా మార్చివేసిందని అన్నారు. కాంగ్రెస్ పాలనలో మన దేశం ఒక దశాబ్ద కాలాన్ని కోల్పోయిందని విమర్శించారు. 

గత 9 ఏళ్లుగా ఈసీ, ఆర్బీఐ, సైన్యంపై విపక్షాలు ఎలాంటి ఆలోచన లేకుండా విమర్శలు గుప్పిస్తున్నాయని మోదీ మండిపడ్డారు. తమ హయాంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి బీజేపీ పాలనపై ప్రజల్లో నమ్మకం బలపడిందని చెప్పారు. ప్రజల నమ్మకమే తనకు సురక్షా కవచమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న ప్రజలకు నిజాలు ఏమిటో తెలుసని చెప్పారు. 

ఎప్పుడూ అత్యంత ఉద్రిక్తంగా ఉండే జమ్మూకశ్మీర్ కు ఇప్పుడు అందరూ వెళ్లొస్తున్నారని మోదీ అన్నారు. గతంలో శ్రీనగర్ లోని లాల్ చౌక్ లో మన జాతీయ జెండాను ఎగురవేయడం ఒక కలలా ఉండేదని... ఇప్పుడు అక్కడ స్వేచ్ఛగా మువ్వన్నెల జెండాను ఎగురవేస్తున్నామని చెప్పారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల వల్ల మారుమూల ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. మధ్య తరగతి ప్రజలపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారిస్తోందని చెప్పారు.

  • Loading...

More Telugu News