YS Vivekananda Reddy: రేపు హైదరాబాద్ సీబీఐ కోర్టుకు వివేకా హత్య కేసు నిందితులు.. నేడు హైదరాబాద్కు తరలింపు
- హైదరాబాద్ తరలించేందుకు వీలుగా నిందితులకు ప్రొడక్షన్ వారెంట్, సమన్ల జారీ
- ప్రత్యేక రక్షణ మధ్య నేడు హైదరాబాద్ తరలింపు
- తొలిసారి కోర్టు ఎదుటకు రానున్న నిందితులు
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితులు రేపు తొలిసారి హైదరాబాద్లో సీబీఐ కోర్టు ఎదుట హాజరుకానున్నారు. ఈ కేసులో మొత్తం ఐదుగురు నిందితులుగా ఉన్నారు. కడప సెంట్రల్ జైలులో రిమాండు ఖైదీలుగా ఉన్న సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్రెడ్డితోపాటు ఇదే కేసులో బెయిలుపై ఉన్న ఎర్రగంగిరెడ్డి, డ్రైవర్ దస్తగిరి శుక్రవారం తొలిసారి సీబీఐ కోర్టు ముందుకు రానున్నారు. ఈ నేపథ్యంలో వీరిని నేడు హైదరాబాద్కు తీసుకురానున్నారు. ప్రత్యేక రక్షణ మధ్య వీరిని హైదరాబాద్ తరలించేందుకు పోలీసులు ఏర్పాటు చేశారు.
వీరిని హైదరాబాద్ తరలించేందుకు వీలుగా కడప జైలులో ఉన్న ముగ్గురు నిందితులకు ప్రొడక్షన్ వారెంట్, బెయిలుపై ఉన్న ఇద్దరికి సీబీఐ నుంచి సమన్లు జారీ అయ్యాయి. వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తు ఇటీవలి వరకు కడప కేంద్రంగా జరగ్గా, సుప్రీంకోర్టు ఆదేశాలతో కేసు దర్యాప్తు హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ అయింది.