Kim Jong Un: కుమార్తెతో మళ్లీ కనిపించిన కిమ్.. వారసురాలు ఆమేనా?
- ఇటీవల తరచూ కుమార్తెతో కనిపిస్తున్న కిమ్
- సీనియర్ అధికారులతో కరచాలనం
- 9 ఏళ్ల ఆ అమ్మాయిని కిమ్ జు యేగా చెబుతున్న మీడియా
- కిమ్ తర్వాత పగ్గాలు ఆమెకేనన్న ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’
ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్ కుటుంబం గురించి ఎప్పటికీ రహస్యమే. బాహ్యప్రపంచానికి వారిని ఎప్పుడూ దూరంగా ఉంచే కిమ్ గతంలో ఒకసారి కుమార్తెతో కలిసి బహిరంగంగా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత కూడా పలుమార్లు కుమార్తెను వెంటబెట్టుకుని అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
తాజాగా మంగళవారం మరోమారు కుమార్తె కిమ్ జు యేతో కలిసి ఆ దేశ మిలటరీ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వెలుగులోకి వచ్చి సర్వత్ర చర్చనీయాంశమయ్యాయి. కుమార్తెను పదేపదే బయటకు తీసుకురావడం ద్వారా దేశ పగ్గాలు తన తర్వాత తన వారసులకే దక్కే అవకాశాలున్నాయన్న సంకేతాలను కిమ్ ఇస్తున్నారని నిపుణులు చెబుతున్నారు.
కిమ్ బయటకు తీసుకొస్తున్న ఆ అమ్మాయి కిమ్ జు యే అని, ఆయన రెండో సంతానమని చెబుతున్నారు. నల్లటి సూట్ ధరించిన ఆమె విందులో తండ్రితో కలిసి పాల్గొన్నారు. వారిచుట్టూ సీనియర్ సైనికాధికారులు నిల్చున్నారు. కాగా, కిమ్ తన 9 ఏళ్ల కుమార్తెతో కలిసి కనిపించడం ఇది నాలుగోసారి. బయటకు వచ్చిన ఫొటోల్లో కిమ్ జు యే తన తండ్రి పక్కన నిల్చుని సీనియర్ అధికారులకు కరచాలనం చేస్తున్నట్టుగా ఉన్నాయి. ఆ తర్వాత సైనికాధికారులు కిమ్‌కు వంగి నమస్కరించారు. కిమ్ జు యేను కిమ్ ప్రియమైన కుమార్తెగా దేశ అధికారిక మీడియా అభివర్ణించింది. అణ్వాయుధ దేశమైన నార్త్ కొరియాను పాలించే వరుసలో కిమ్ జు యే తర్వాతి స్థానంలో ఉన్నట్టు ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ పేర్కొంది.