CBI: ఎమ్మెల్యేలకు ఎర కేసు.. తెలంగాణ సీఎస్​కు ఆరోసారి లేఖ రాసిన సీబీఐ

CBI has written to Telangana CS for the sixth time
  • ఎమ్మెల్యేలకు ఎర కేసు ఎఫ్ఐఆర్ వివరాలు కోరుతూ లేఖ
  • ఇప్పటికే ఐదుసార్లు కోరినా స్పందించని రాష్ట్ర ప్రభుత్వం
  • కోర్టుకు వెళ్లే యోచనలో సీబీఐ అధికారులు
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీబీఐ మరోసారి లేఖ రాసింది. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ వివరాలను ఇవ్వాలని సీబీఐ అధికారులు వరుసగా ఆరోసారి సీఎస్ కు లేఖ రాశారు. తాజాగా ఈ నెల 6వ తేదీన రాసిన లేఖలో మెయినాబాద్ పోలిస్ స్టేషన్ లో నమోదైన ఎఫ్ఐఆర్ వివరాలు ఇవ్వాలని సీబీఐకి చెందిన ఢిల్లీ ఎస్పీ లేఖలో కోరారు. 

ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తును నిలిపేస్తూ, కేసును సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్  డిసెబంర్ 26న ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో అదే నెల 31వ తేదీన సీఎస్ కు సీబీఐ నుంచి లేఖ వచ్చింది. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా దర్యాప్తు వివరాలు ఇవ్వాలని అందులో  కోరారు. ఆ తర్వాత జనవరి 5, 9, 11, 26 తేదీల్లోనూ సీబీఐ నుంచి సీఎస్ కు వరుసగా లేఖలు వచ్చాయి. వాటిపై స్పందన లేకపోవడంతో ఆరోసారి లేఖ పంపించారు. ఎఫ్ఐఆర్ వివరాలను ప్రభుత్వం ఇవ్వకపోతే సీబీఐ అధికారులు కోర్టుకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, ఈ కేసును సీబీఐకి అప్పగించడాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఈ నెల 17వ తేదీన దీనిని విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.
CBI
mla
brs
cs
Telangana
letter

More Telugu News