Britain: మీరు ఇలాంటి ఆహారాన్ని తీసుకుంటున్నారా?.. అయితే జరభద్రం!

Cancer Risk For Who Take Processed Food
  • ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల కేన్సర్ ముప్పు పెరుగుతుందన్న శాస్త్రవేత్తలు
  • బ్రిటన్‌లోని ఇంపీరియల్ కాలేజీ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి
  • పదేళ్లపాటు 2 లక్షల మంది డేటాను విశ్లేషించిన పరిశోధకులు
మీరు ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటారా? అయితే, మీకు కేన్సర్ ముప్పు పొంచి ఉన్నట్టే. ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకోవడం వల్ల కేన్సర్‌తో మరణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బ్రిటన్ శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో తేలింది. శీతల పానీయాలు, ప్యాక్ చేసిన ఆహార పదార్థాల వంటివి ప్రాసెస్డ్ ఫుడ్ విభాగంలోకి వస్తాయి. వీటిలో ఉప్పు, కొవ్వు, చక్కెర, రసాయనాలు కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు. ఫలితంగా వీటిని తీసుకోవడం వల్ల ఊబకాయం, టైప్-2 డయాబెటిస్, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని ఇప్పటికే తేలింది. 

తాజాగా, బ్రిటన్‌లోని ఇంపీరియల్ కాలేజీ పరిశోధకులు ప్రాసెస్ చేసిన ఆహారంపై పరిశోధనలు జరిపారు. ఇందులో భాగంగా మధ్య వయసులో ఉన్న 2 లక్షల మందికి సంబంధించిన డేటాను విశ్లేషించారు. పదేళ్లపాటు జరిగిన ఈ పరిశోధనలో కేన్సర్‌కు సంబంధించిన భయంకరమైన విషయాలు వెలుగు చూశాయి. 

ఈ ఆహారాన్ని తీసుకున్న వారు రొమ్ము కేన్సర్ బారినపడే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు తేలింది. ప్రాసెస్డ్ ఫుడ్‌ను తీసుకోవడం 10 శాతం పెరిగితే కేన్సర్ బారినపడే అవకాశం 2 శాతం పెరుగుతుందని ఈ అధ్యయనంలో తేలినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. అంతేకాదు, కేన్సర్‌తో మరణించే ముప్పు కూడా 6 శాతం పెరుగుతుందని పేర్కొన్నారు.
Britain
Imperial College London
Processed Food
Breast Cancer

More Telugu News