Jaganasura Rakta Charitra: 'జగనాసుర రక్తచరిత్ర' పుస్తకాన్ని విడుదల చేసిన టీడీపీ.. వివేకాను అత్యంత క్రూరంగా చంపారన్న అచ్చెన్నాయుడు
- వైఎస్ వివేకా హత్య నేపథ్యంలో 'జగనాసుర రక్తచరిత్ర'
- అధికారంలోకి రావడానికి సొంత బాబాయ్ నే చంపేశారన్న అచ్చెన్నాయుడు
- 'నారాసుర రక్తచరిత్ర' అంటూ జగన్ తప్పుడు ప్రచారం చేయించాడని మండిపాటు
వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య నేపథ్యంలో 'జగనాసుర రక్తచరిత్ర' పేరిట ఓ పుస్తకాన్ని తెలుగుదేశం పార్టీ విడుదల చేసింది. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఇతర కీలక నేతలు ఈ పుస్తకాన్ని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వివేకాను ఎవరు హత్య చేశారు? అనే నిజాన్ని ప్రజలకు తెలిపేందుకే ఈ పుస్తకాన్ని విడుదల చేశామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఈ పుస్తకాన్ని అందిస్తామని తెలిపారు.
తండ్రి వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు లక్ష కోట్ల రూపాయల అవినీతి చేసిన జగన్ ను ఎన్నికల ముందు ప్రజలు నమ్మే పరిస్థితి లేదని... తాను అధికారంలోకి రాలేననే భయంతో జగన్ ఎన్నో డ్రామాలు ఆడారని అచ్చెన్న చెప్పారు. విశాఖ ఎయిర్ పోర్టులో కోడికత్తి వంటి డ్రామాలు ఆడారని... అయినా ప్రజల్లో మార్పు రాకపోయేసరికి, చివరకు రాజకీయాల కోసం తన సొంత బాబాయ్ వివేకాను కూడా హత్య చేయించారని తెలిపారు. తనకు తెలిసినంతవరకు వివేకాను హత్య చేసినంత క్రూరంగా మరెవరినీ చంపి ఉండరని చెప్పారు. దాదాపు మూడున్నర గంటల సేపు వివేకాను హింసిస్తూ, గొడ్డలితో నరికి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు.
వివేకా గుండెపోటుతో చనిపోయారని తొలుత విజయసాయిరెడ్డి మీడియా ముఖంగా అబద్ధాలు చెప్పారని అచ్చెన్నాయుడు విమర్శించారు. ఈ హత్య సంచలనంగా మారిందని... దీన్ని రాజకీయాలకు అనుగుణంగా మార్చుకునేందుకు ఆ తర్వాత ప్రయత్నించారని... ఈ హత్య చంద్రబాబే చేయించారంటూ... 'నారాసుర రక్తచరిత్ర' అంటూ తన సొంత పత్రికలో జగన్ ప్రచారం చేయించారని మండిపడ్డారు. హత్య వారే చేయించి... చంద్రబాబు పరపతిని దెబ్బతీసేందుకు ఆయనపై తప్పుడు ప్రచారం చేశారని దుయ్యబట్టారు.
ఇప్పుడు సీబీఐ విచారణలో వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయని అచ్చెన్న చెప్పారు. ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని గంటల సేపు సీబీఐ అధికారులు విచారించారని, ఇతర నిందితులు కూడా కోర్టుకు హాజరయ్యారని తెలిపారు. జగన్ భార్య భారతి పీఏ సీబీఐ విచారణకు హాజరయ్యారని... దీనిపై ఇంతవరకు జగన్ మాట్లాడకపోడం దారుణమని చెప్పారు. ఇలాంటి హత్యలు చేసిన కిరాతకులను సీబీఐ శిక్షించకపోతే... ఆ దుష్ట శక్తులు మరింత చెలరేగిపోతాయని అన్నారు. వీలైనంత త్వరగా హంతకులను సీబీఐ శిక్షించాలని కోరుతున్నామని చెప్పారు.