Ambati Rambabu: గత ప్రభుత్వం వల్లే పోలవరంకు కష్టాలు: మంత్రి అంబటి రాంబాబు విమర్శలు
- ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కావడానికి టీడీపీ ప్రభుత్వమే కారణమన్న అంబటి
- కాఫర్ డ్యామ్ పనులను గాలికి వదిలేశారని విమర్శ
- కేంద్ర నిధులు రాకున్నా పనులు పూర్తి చేస్తున్నామని వ్యాఖ్య
గత ప్రభుత్వ తొందరపాటు వల్ల పోలవరం ప్రాజెక్టుకు కష్టాలు వచ్చాయని ఏపీ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కావడానికి గత టీడీపీ ప్రభుత్వమే కారణమని చెప్పారు. గత ప్రభుత్వం కాఫర్ డ్యామ్ పనులను గాలికి వదిలేసిందని.... తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాఫర్ డ్యామ్ ఎత్తును పెంచామని అన్నారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అయినప్పటికీ... కేంద్ర నిధులు రాకపోయినా, రాష్ట్ర నిధులను ఖర్చు చేస్తూ ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తున్నామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును ఈరోజు అంబటి సందర్శించారు. ఈ సందర్భంగా కాఫర్ డ్యామ్, డయాఫ్రం వాల్ పనులతో పాటు ఇతర పనులను కూడా పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు.