Vande Bharat Trains: ఒకే రోజు రెండు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- ముంబయి-షిర్డీ మధ్య ఒక రైలు
- ముంబయి-షోలాపూర్ మధ్య మరో రైలు
- దేశంలో 10కి పెరిగిన వందేభారత్ రైళ్లు
భారత్ లో వందేభారత్ రైళ్ల శకం ఆరంభమైంది. ఇప్పటికే పలు మార్గాల్లో వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టిన కేంద్రం... తాజాగా మరో రెండు వందేభారత్ రైళ్లను ముంబయి నుంచి ప్రారంభించింది. ప్రధాని నరేంద్ర మోదీ నేడు ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ స్టేషన్ లో పచ్చజెండా ఊపి ఈ రైళ్లను ప్రారంభించారు. వీటిలో ఒకటి ముంబయి-షిర్డీ, మరొకటి ముంబయి-షోలాపూర్ మార్గాల్లో ప్రయాణించనున్నాయి.
వీటిని ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ, దేశాభివృద్ధి వేగాన్ని వందేభారత్ రైలు ప్రతిబింబిస్తోందని తెలిపారు. ఆధునిక భారతదేశానికి ఇదొక ఘనతర నిదర్శనం అని పేర్కొన్నారు.
కాగా, నేడు ప్రారంభోత్సవం జరుపుకున్న రెండు రైళ్లతో కలిపి దేశంలో ఇప్పటివరకు తిరుగుతున్న వందేభారత్ రైళ్ల సంఖ్య 10కి పెరిగింది. కాగా, గతంలో ప్రారంభోత్సవం జరుపుకున్న 8 వందేభారత్ రైళ్లు అంతర్రాష్ట్ర రైళ్లు కాగా, నేడు ప్రారంభించిన వందేభారత్ రైళ్లు ఒకే రాష్ట్రం (మహారాష్ట్ర)లో తిరగనున్నాయి.