Hyderabad: మా తెలంగాణ పార్టీ అధ్యక్షుడికి రూ. లక్ష జరిమానా.. ఆగ్రహం వ్యక్తం చేస్తూ పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు

Supreme Court Fined Rs One Lakh For Maa Telangana Party Chief Veera Reddy

  • హైదరాబాద్‌లోని బల్క్ డ్రగ్, ఫార్మాస్యూటికల్ కంపెనీలపై హైకోర్టులో వీరారెడ్డి పిటిషన్
  • కాలుష్య నియంత్రణ మండలి అప్పిలేట్‌ను ఆశ్రయించిన విషయం దాచిపెట్టిన వైనం
  • పిటిషన్‌ను కొట్టివేస్తూ రూ. 50 వేల జరిమానా
  • ఇప్పుడు సుప్రీంకోర్టులోనూ చుక్కెదురు

మా తెలంగాణ పార్టీ అధ్యక్షుడు కె.వీరారెడ్డికి సుప్రీంకోర్టు రూ. లక్ష జరిమానా విధించింది. గతంలో హైకోర్టు విధించిన రూ. 50 వేల జరిమానాకు ఇది అదనమని పేర్కొంటూ ఆయన వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ సహా సమీపంలోని బల్క్ డ్రగ్, ఫార్మాస్యూటికల్ కంపెనీల్లో జీరో లిక్విడ్ డిశ్చార్జ్ వ్యవస్థల ఏర్పాటుపై వీరారెడ్డి గతంలో హైకోర్టులో పిటిషన్ వేశారు. 

అయితే, ఆయన హైకోర్టును ఆశ్రయించడానికి ముందే కాలుష్య నియంత్రణ మండలి అప్పిలేట్ అథారిటీని కూడా ఆశ్రయించారు. ఈ విషయాన్ని ఆయన హైకోర్టు ముందు దాచడంతో పిటిషన్‌ను కొట్టేసిన న్యాయస్థానం రూ. 50 వేల జరిమానా విధించింది. పిటిషన్‌ కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై వీరారెడ్డి సుప్రీంను ఆశ్రయించారు.

ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్థీవాలాతో కూడిన సుప్రీం ధర్మాసనం నిన్న ఈ పిటిషన్‌ను విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్‌పై సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పసలేని వ్యాజ్యంతో న్యాయస్థానం విలువైన సమయాన్ని వృథా చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ లక్షరూపాయల జరిమానా విధించారు. గతంలో హైకోర్టు విధించిన రూ. 50 వేల జరిమానాకు ఇది అదనమని కోర్టు స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News