Cow Hug Day: సోషల్ మీడియా దెబ్బకు వెనక్కి తగ్గిన కేంద్రం.. ‘కౌ హగ్ డే’పై యూ టర్న్!
- ఫిబ్రవరి 14న ‘కౌ హగ్ డే’గా జరుపుకోవాలంటూ కేంద్ర పశుసంవర్థక శాఖ ఉత్తర్వులు
- గోవును కౌగిలించుకుంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుందని వ్యాఖ్య
- ప్రతిపక్షాలు, సోషల్ మీడియా నుంచి వ్యతిరేకత రావడంతో ఉత్తర్వులు ఉపసంహరించుకున్న కేంద్రం
వాలెంటైన్స్ డేని జరుపుకునే ఫిబ్రవరి 14ను ‘కౌ హగ్ డే’గా జరుపుకోవాలంటూ ఉత్తర్వులు విడుదల చేసిన కేంద్రం యూటర్న్ తీసుకుంది. సోషల్ మీడియా నుంచి విపరీతమైన వ్యతిరేకత రావడంతో ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. ఫిబ్రవరి 14న ‘కౌ హగ్ డే’ జరుపుకోవాలంటూ ఇటీవల కేంద్ర పశుసంవర్థక బోర్డు (ఏవీబీఐ)ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
భారత సంస్కృతికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు గోవు వెన్నెముక అని, దానిని కౌగిలించుకుంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుందని ఆ ఉత్తర్వుల్లో ఏవీబీఐ పేర్కొంది. కౌ హగ్ డేపై ప్రజల్లో సానుకూలత వ్యక్తమైతే అంతకుమించి సంతోషం ఏముంటుందని కేంద్ర పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాలా పేర్కొన్నారు.
అయితే, వాలెంటైన్స్ డే నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేంద్రం ‘కౌ హగ్ డే’ను ప్రకటించిందంటూ సోషల్ మీడియా దుమ్మెత్తి పోసింది. రాజకీయంగానూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేంద్రం ‘కౌ హగ్ డే’ను తెరపైకి తెచ్చిందని కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్ థాకరే), టీఎంసీ దుమ్మెత్తి పోశాయి. అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తుండడంతో ఉక్కిరిబిక్కిరి అయిన ఏవీబీఐ తన ప్రకటనను ఉపసంహరించుకుంది.