world war 2 bomb: వరల్డ్ వార్ 2 నాటి బాంబు తాజాగా ఇంగ్లాండ్ లో పేలింది.. వీడియో ఇదిగో!

Video Shows Huge Blast In UK Town After World War II Bomb Detonates

  • బాంబును గుర్తించి డిఫ్యూజ్ చేయడానికి ప్రయత్నించిన పోలీసులు
  • బాంబు నిర్వీర్యం చేయడానికి రోబోలను ఉపయోగించిన అధికారులు
  • ప్రమాదవశాత్తూ మధ్యలోనే పేలిన బాంబు.. డ్రోన్ కెమెరాలో రికార్డైన దృశ్యాలు

రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి బాంబును గుర్తించి డిఫ్యూజ్ చేస్తుండగా భారీ పేలుడు సంభవించింది.. ఇంగ్లాండ్ లోని నార్ ఫోల్క్ కౌంటీలో ఈ పేలుడు జరిగింది. అయితే, ఇది ప్లాన్ చేసి జరిపిన పేలుడు కాదని, హఠాత్తుగా జరిగిందని పోలీసులు తెలిపారు. ఇందులో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని వెల్లడించారు. నార్ ఫోల్క్ కౌంటీలోని గ్రేట్ యార్మౌత్ టౌన్ లో పాతకాలం నాటి పేలని బాంబును అధికారులు గుర్తించారు.

ఇలా గుర్తించిన బాంబులను డిఫ్యూజ్ చేయడానికి అధికారులు ప్రయత్నిస్తారు. డిఫ్యూజ్ చేయడం కుదరని సందర్భంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని బాంబును పేల్చేస్తారు. ఇదేవిధంగా మంగళవారం గుర్తించిన బాంబును డిఫ్యూజ్ చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా బాంబును గుర్తించినచోట చుట్టుపక్కల ప్రదేశాల్లోని జనాలను అక్కడి నుంచి తరలించారు. ట్రాఫిక్ ను దారి మళ్లించి, రోబోలతో బాంబును డిఫ్యూజ్ చేయడానికి ఉపక్రమించారు.

ఈ ప్రయత్నంలో బాంబు పేలిపోవడంతో భారీ విస్పోటనం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, ఆస్తినష్టాన్ని అంచనా వేస్తున్నామని వివరించారు. ప్రస్తుతం ప్రమాదమేమీ లేదని పేర్కొన్నారు. చుట్టుపక్కల జనావాసాలకు చెందిన ప్రజలు తిరిగి తమ తమ ఇళ్లకు వెళ్లొచ్చని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కాగా, పేలుడు కారణంగా భారీగా దుమ్ము, ధూళి గాలిలోకి ఎగిసిపడింది. ఆ ప్రాంతంలో కొద్దిసేపు పొగ నిండిపోయింది. బాంబును నిర్వీర్యం చేసే ప్రక్రియను రికార్డు చేయడానికి ఉపయోగించిన డ్రోన్ కెమెరాలో ఈ పేలుడు దృశ్యాలు రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోను నార్ ఫోల్క్ పోలీసులు ట్విట్టర్లో పెట్టడంతో అదికాస్తా వైరల్ గా మారింది.

  • Loading...

More Telugu News