Draupadi murmu: ఆకలిని చంపుకుని చదువుకున్నా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- రమాదేవీ వర్సిటీ స్నాతకోత్సవంలో ముర్ము భావోద్వేగపూరిత ప్రసంగం
- ఆకలిని చంపుకుని చదువుకున్నానని వెల్లడి
- వీరనారీమణుల స్ఫూర్తితో ముందుకు సాగాలంటూ విద్యార్థులకు సూచన
చిన్నతనంలో తాను ఆకలిని చంపుకుని చదువుకున్నానని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తాజాగా వెల్లడించారు. ఒడిశాలోని భువనేశ్వర్‌లోగల రమాదేవీ వర్సిటీ స్నాతకోత్సవంలో శుక్రవారం పాల్గొన్న ఆమె భావోద్వేగపూరిత ప్రసంగం చేశారు. రమాదేవీ వర్సిటీలో చదువుకున్న రాష్ట్రపతి తన చిన్ననాటి పరిస్థితులు గుర్తు చేసుకుని ఉద్వేగానికి లోనయ్యారు.
మయూర్‌భంజ్ జిల్లాలోని మారుమూల ఆదివాసీ గ్రామం నుంచి చదువు నిమిత్తం భువనేశ్వర్ చేరుకున్నానని రాష్ట్రపతి పేర్కొన్నారు. పేదరికం వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డానని చెప్పుకొచ్చారు. వేరుశనక్కాయలు తినాలని ఉన్నా..పావలా మిగుల్చుకునేందుకు ఆకలిని చంపుకున్న రోజులు ఇప్పటికీ గుర్తున్నాయని చెప్పారు.
ప్రస్తుతం మహిళలు పురుషులతో సమానంగా దూసుకెళ్లడం సంతోషకరమని రాష్ట్రపతి ముర్ము వ్యాఖ్యానించారు. పార్లమెంటులో ప్రస్తుతం 115 మంది మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, ప్రతి రంగంలోనూ సత్తాచాటుతున్నారని పేర్కొన్నారు. చరిత్రలో సుస్థిరస్థానం సంపాదించుకున్న వీరనారీమణుల స్ఫూర్తితో విద్యార్థులు ముందుకు సాగాలని సూచించారు.
స్నాతకోత్సవ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇద్దరికి పీహెచ్‌డీ, 22 మందికి పసిడి పతకాలు అందజేశారు.