Telangana: మెట్రో ఛార్జీల పెంపులో మా బాధ్యత లేదు: కేటీఆర్
- ఛార్జీల నిర్ణయాధికారం నిర్వహణా సంస్థలకే కేంద్రం కట్టబెట్టింది
- అడ్డగోలుగా పెంచొద్దని ఎల్ అండ్ టీ కంపెనీనీ హెచ్చరించామన్న మంత్రి
- మెట్రోలో తెలంగాణ యువతీయువకులు పనిచేస్తున్నారని వెల్లడి
- భట్టి విక్రమార్క ప్రశ్నకు అసెంబ్లీలో బదులిచ్చిన మంత్రి కేటీఆర్
మెట్రో ఛార్జీల పెంపులో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఏమీలేదని మంత్రి కేటీఆర్ తేల్చిచెప్పారు. అసెంబ్లీలో కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్ బదులిచ్చారు. ఛార్జీల నిర్ణయాధికారాన్ని కేంద్ర ప్రభుత్వం మెట్రో నిర్వహణ సంస్థకే కట్టబెట్టిందని మంత్రి వివరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మెట్రో యాక్ట్ ప్రకారం.. ఛార్జీలు ఎంత వసూలు చేయాలని నిర్ణయించుకునే అధికారం నిర్వహణ సంస్థలకే ఉంది.
ప్రస్తుతం మెట్రో నిర్వహణ బాధ్యతలను ఎల్ అండ్ టీ చూస్తోంది. ఛార్జీలను పెంచాలని నిర్ణయించి, అమలు చేసింది ఆ సంస్థేనని మంత్రి కేటీఆర్ చెప్పారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎల్ అండ్ టీకి ఈ విషయంలో తగిన సూచనలు చేశామని మంత్రి సభలో వెల్లడించారు. అడ్డగోలుగా ధరలు పెంచితే ఊరుకోబోమని హెచ్చరించినట్లు వివరించారు. ఆర్టీసీ బస్ ఛార్జీలతో సరిసమానంగా ఉండేలా చూసుకోవాలని చెప్పామన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ పలు అరోపణలు గుప్పించారు. మెట్రో ప్రాజెక్టు విషయంలో కూడా తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తోందని మంత్రి విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మెట్రోలకు భారీగా నిధులు కేటాయించి, తెలంగాణకు మాత్రం మొండిచెయ్యి చూపిస్తున్నారని మండిపడ్డారు. వడ్డించే వాళ్లు మనవాళ్లైతే భోజన ఫంక్తిలో ఎక్కడ కూర్చున్నా ఢోకాలేదన్నట్లు కేంద్రం ప్రవర్తిస్తోందని మంత్రి ఆరోపించారు.