Gujarat: గుజరాత్ లో భూకంపం... సూరత్ పరిసరాల్లో ప్రకంపనలు
- గత అర్ధరాత్రి తర్వాత కంపించిన భూమి
- రిక్టర్ స్కేలుపై 3.8 తీవ్రత నమోదు
- భయాందోళనలకు గురైన ప్రజలు
- అరేబియా సముద్రంలో భూకంప కేంద్రం
ఇటీవల టర్కీ, సిరియా దేశాలను భారీ భూకంపాలు కుదిపేసిన నేపథ్యంలో, భూకంపం అంటేనే ప్రజలు హడలిపోయే పరిస్థితి నెలకొంది. కాగా, గుజరాత్ లో భూకంపం సంభవించింది. సూరత్ సహా పలు ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై ఈ భూకంపం తీవ్రత 3.8గా నమోదైంది.
గత అర్ధరాత్రి తర్వాత సంభవించిన ఈ భూకంపంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. అయితే ఎవరికీ గాయాలు కాలేదు. ఎలాంటి ఆస్తినష్టం జరగలేదు. ఈ భూకంప కేంద్రం సూరత్ కు నైరుతి దిశగా 27 కీలోమీటర్ల దూరంలో అరేబియా సముద్రంలో ఉన్నట్టు గుర్తించారు.
గుజరాత్ లోని కచ్ ప్రాంతంలో 2001లో సంభవించిన భారీ భూకంపంలో 13,800 మంది మృత్యువాత పడగా, 1.67 లక్షల మంది క్షతగాత్రులయ్యారు. గత రెండు శతాబ్దాల్లో ఇది ప్రపంచంలోనే అతిభారీ భూకంపాల్లో మూడవది కాగా, భారత్ లో అత్యంత విధ్వంసం సృష్టించిన భూకంపాల్లో రెండోది.