Mallu Bhatti Vikramarka: అసెంబ్లీలో భట్టి, మంత్రి హరీశ్ రావు మధ్య 'జల' యుద్ధం

Debate between Bhatti and Harish Rao in assembly

  • నీటిపారుదల అంశాలపై చర్చ
  • ఏపీ ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టు చేపడుతోందన్న భట్టి
  • తెలంగాణ ప్రభుత్వం అడ్డుకోవడంలేదని ఆరోపణ
  • ఏపీ సర్కారు ఎన్జీటీతో ఆదేశాలు ఇప్పించామన్న హరీశ్
  • ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పనులు జరగడంలేదని వెల్లడి

తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ కాంగ్రెస్ సభాపక్షనేత మల్లు భట్టి విక్రమార్క, మంత్రి హరీశ్ రావు మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. 

ఏపీ ప్రభుత్వం చేపడుతున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ను తెలంగాణ ప్రభుత్వం అడ్డుకోవడం లేదని, తద్వారా అధికంగా నష్టపోయేది ఖమ్మం జిల్లానే అని భట్టి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా ఆశలన్నీ నాగార్జునసాగర్ ఎడమ కాలువపైనే ఉన్నాయని భట్టి పేర్కొన్నారు. 

పాలేరు నుంచి మొదలుపెడితే వైరా, మధిర, సత్తుపల్లి, ఖమ్మం తదితర ప్రాంతాలకు తాగునీరు రావాలన్నా ఎన్ఎస్ పీ కెనాలే దిక్కు అని వెల్లడించారు. ఈ విషయం ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు కూడా తెలుసని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో అనేక ప్రాజెక్టులు చేపట్టారని, అయితే కాంగ్రెస్ పార్టీపై కోపంతో ఆ ప్రాజెక్టులను నిలిపి ఉంచడం మంచిది కాదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ సంగతి అటుంచండి... మొదట ప్రజలు నష్టపోతున్నారు... ముందు ఆ విషయం చూడండి అని హితవు పలికారు. 

గత ప్రభుత్వాల్లో అనేక లిఫ్ట్ ఇరిగేషన్లు ఏర్పాటు చేశారని, కానీ అవి ఇప్పుడు ఓ మోస్తరు మరమ్మతులతో మూలనపడ్డాయని, ప్రభుత్వం వాటిని పట్టించుకోవాలని భట్టి డిమాండ్ చేశారు. కాళేశ్వరానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించారని, పంపులు కట్టారు కానీ తమను వెళ్లనివ్వరని భట్టి ఆరోపించారు. ప్రాణహిత కూడా పూర్తిచేయాలని, దేవాదుల ప్రాజెక్టును ఎందుకు విస్మరిస్తున్నారని నిలదీశారు. 

ఈ దశలో మంత్రి హరీశ్ రావు పైకిలేవడంతో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి... సీఎల్పీ నేత భట్టిని ఇక కూర్చోవాల్సిందిగా సూచించారు. అనంతరం మంత్రి హరీశ్ రావు బదులిచ్చారు. "అంతరాయం కలిగించినందుకు క్షమించాలి. భట్టి గారంటే నాకు చాలా గౌరవం. ఆయన చాలా అనుభవజ్ఞులు. బాధాకరమైన విషయం ఏమిటంటే ఆయనకు సమాచారం అందిస్తున్నవారు తప్పుడు సమాచారం అందిస్తున్నారు... ఆయనను తప్పుదోవ పట్టిస్తున్నారన్న కారణంతో ఇప్పుడు మధ్యలో మాట్లాడాల్సి వస్తోంది తప్ప... భట్టిపై గౌరవం లేక కాదు. 

డీపీఆర్ లు లేనేలేవని, డీపీఆర్ లు సమర్పించనేలేదని వీళ్లు బయటికి వెళ్లి అసత్య ప్రచారం చేస్తున్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ ను 13-09-2022 నాడు కేంద్ర జలమండలికి సమర్పించాం. 

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ను ప్రభుత్వం అడ్డుకోవడంలేదని, దాంతో ఫేజ్-2 ఎన్ఎస్ పీ కి నీళ్లు రానేరావని మాపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పూర్తిగా తప్పు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం తీవ్రమైన ప్రయత్నం చేసింది. 12-05-2020 నాడు కేఆర్ఎంబీలో దీనిపై ప్రభుత్వం తరఫున గట్టిగా వాదనలు వినిపించాం. అదే ఏడాది జూన్ లోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించి అపెక్స్ కౌన్సిల్ వద్దకే ఈ సమస్యను తీసుకెళ్లాలని పోరాటం చేశాం. 

తెలంగాణ ప్రభుత్వం చేసిన తీవ్ర పోరాటంతో రాయలసీమ ప్రాజెక్టును ఆపివేయాలంటూ ఏపీ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ తో ఆదేశాలు ఇప్పించగలిగాం. ఇవాళ రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు ఆగిపోయాయి. తద్వారా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాం. 

కానీ మేం ఏమీ చేయనట్టుగా మీరు తప్పుడు సమాచారంతో ఆరోపణలు చేస్తున్నారు... కాబట్టే ఈ వివరణ ఇస్తున్నాం" అని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. ఒకవేళ పాలమూరు ప్రాజెక్టు చూడాలనుకుంటే రేపే వెళదాం పదండి అని భట్టికి సూచించారు.  

ఈ చర్చ సందర్భంగా భట్టి కానీ, హరీశ్ రావు కానీ ఎలాంటి పరుష పదజాలం జోలికి పోకుండా, కేవలం నీటి పారుదల అంశాలపైనే మాట్లాడడం విశేషం.

  • Loading...

More Telugu News