Kondagattu: ఎల్లుండి కొండగట్టుకు కేసీఆర్.. మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై అధికారులతో చర్చ!
- ఆలయ మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై అధికారులతో చర్చలు
- కొండగట్టు అభివృద్ధికి రూ. 100 కోట్లు కేటాయించిన ప్రభుత్వం
- నేడు కొండగట్టు వెళ్లనున్న ఆర్కిటెక్ట్ ఆనంద్‌సాయి
- త్వరలోనే లాల్ దర్వాజా ఆలయ విస్తరణ పనులు ప్రారంభిస్తామన్న మంత్రి తలసాని
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 14న కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై అధికారులతో చర్చలు జరుపుతారు. కాగా, కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆనంద్‌సాయి నేడు కొండగట్టు వెళ్లనున్నారు. ఆలయ పరిశీలన అనంతరం ఆలయ పునర్నిర్మాణ ప్రణాళికలను రూపొందిస్తారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో కొండగట్టు ఆలయ అభివృద్ధికి రూ. 100 కోట్లు ప్రకటించి నిధులు కేటాయించింది.
మరోవైపు, హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని లాల్ దర్వాజా అమ్మవారి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను త్వరలోనే ప్రారంభించనున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గతేడాది అమ్మవారి దర్శనానికి వచ్చిన సీఎం కేసీఆర్ ఆలయ అభివృద్ధిపై హామీ ఇచ్చినట్టు మంత్రి పేర్కొన్నారు.
ఇందులో భాగంగా మరో పది రోజుల్లో భూమి పూజ చేయనున్నట్టు తెలిపారు. ఆలయ విస్తరణకు 1100 గజాల స్థలాన్ని గుర్తించినట్టు పేర్కొన్న మంత్రి.. భూముల యజమానులకు పరిహారం కోసం రూ. 8.95 కోట్లను సీఎం మంజూరు చేసినట్టు తెలిపారు. అలాగే, కంచన్‌బాగ్, ఉప్పుగూడ, జంగంమెట్‌లలో మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్ల నిర్మాణానికి సీఎం రూ. 19 కోట్లు కేటాయించినట్టు మంత్రి తలసాని వెల్లడించారు.