Telangana: ప్రతీ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్​ వెజ్​ మార్కెట్లు: సీఎం కేసీఆర్​

Integrated veg and non veg markets to come up in every constituency says CM KCR
  • 2 లక్షల జనాభాకు ఒక మార్కెటైనా ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి
  • నిజాం కాలంలో నిర్మించిన మోండా మార్కెట్ అద్భుతంగా ఉందని కితాబు
  • హైదరాబాద్‌లో జనాభాకు అనుగుణంగా మార్కెట్లు లేవన్న కేసీఆర్
తెలంగాణలో ప్రతి నియోజకవర్గంలో వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు అందుబాటులోకి తెస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదివారం అసెంబ్లీలో ప్రకటించారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్లపై శాసన సభలో చర్చలో ఆయన మాట్లాడారు. మనం తినే ఆహారం పరిశుభ్రంగా ఉండాలన్న సీఎం కేసీఆర్.. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. హైదరాబాద్‌లో జనాభాకు అనుగుణంగా మార్కెట్లు లేవని అన్నారు. గతంలో ఆరేడు మార్కెట్లు మాత్రమే ఉండేవని చెప్పారు. నిజాం హయాంలో కట్టిన మోండా మార్కెట్‌ని చూసి ఆశ్చర్యపోయానని తెలిపారు.

చాలా చోట్ల మార్కెట్లు అపరిశుభ్రంగా ఉండటం చూసి సమీకృత వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్లకు శ్రీకారం చుట్టామని వెల్లడించారు. అధునాతన కూరగాయల మార్కెట్లు ప్రతి నియోజకవర్గంలో తేవాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉందని తెలిపారు. మోండా మార్కెట్‌ని కలెక్టర్లందరికీ చూపించామని, అలాంటి మార్కెట్లు అన్ని జిల్లాల్లో నిర్మించాలని సూచించినట్టు వెల్లడించారు. కనీసం 2 లక్షల జనాభాకు ఒక మార్కెటైనా ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇక, నకిలీ విత్తనాల బెడద లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. నకిలీ విత్తనాలు అమ్మేవారిపై దేశంలోనే తొలిసారిగా పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నామని చెప్పారు.
Telangana
Integrated markets
cm KCR
constituency

More Telugu News