Telangana: బస్తీ దవాఖానాల్లో పరీక్షల వల్ల పేదలకు రూ. 12 కోట్లు ఆదా: హరీశ్ రావు
- ప్రస్తుతం బస్తీ దవాఖానాల్లో 57 పరీక్షలు
- మార్చి నుంచి వాటి సంఖ్యను 134కు పెంచుతున్నట్టు చెప్పిన హరీశ్ రావు
- బస్తీ దవాఖానాల వల్ల గాంధీ, ఉస్మానియాలను ఆశ్రయించే వారి సంఖ్య తగ్గిందన్న మంత్రి
బస్తీ దవాఖానాల్లో ప్రస్తుతం చేస్తున్న 57 పరీక్షల సంఖ్యను మార్చి నుంచి 134కు పెంచుతున్నట్టు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా నిన్న పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా హరీశ్ రావు మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. పరీక్షల పెంపు కోసం టెండర్లు పిలిచినట్టు చెప్పారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్ పరీక్షలకు రూ. 800 చొప్పున వసూలు చేస్తున్నారని, బస్తీ దవాఖానాల్లో వాటిని ఉచితంగా చేయంచుకోవడం వల్ల పేదలకు దాదాపు రూ. 12 కోట్లు ఆదా అయినట్టు చెప్పారు.
బస్తీ దవాఖానాల కారణంగా ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఫీవర్ ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య తగ్గినట్టు మంత్రి తెలిపారు. బస్తీ దవాఖానాలు ఇప్పటి వరకు దాదాపు కోటి మందికి వైద్య సేవలు అందించినట్టు చెప్పారు. ప్రస్తుతం 9 జిల్లాల్లో ఇస్తున్న న్యూట్రిషన్ కిట్లను ఏప్రిల్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అందిస్తామన్నారు. అలాగే, జీహెచ్ఎంసీ పరిధిలో 1590 ఏఎన్ఎం పోస్టుల భర్తీకి ఈ నెలలోనే నోటిఫికేషన్ ఇస్తామన్న మంత్రి.. 950 వైద్యుల పోస్టులను కూడా త్వరలోనే భర్తీ చేస్తామని వివరించారు.