Harley Davidson: 1908 నాటి హార్లీ డేవిడ్ సన్ బైక్.. వేలంలో రూ. 7.72 కోట్లు!

1908 Harley Davidson is most expensive bike ever sold at auction
  • లాస్ వేగాస్‌లో గత నెలలో వేలం 
  • సైకిల్‌ను పోలిన ఈ బైక్‌కు ‘స్ట్రాప్ ట్యాంక్’ అని పేరు
  • బైక్‌లో ఇప్పటికీ చాలా వరకు ఒరిజనల్ పార్ట్స్
  • ధరను ముందే ఊహించామన్న ‘మెకమ్ ఆక్షన్’
‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’ అని ఎందుకంటారో ఈ విషయం తెలిస్తే అర్థమవుతుంది. 1908 నాటి స్ట్రాప్ ట్యాంక్ హార్లీ డేవిడ్‌సన్ బైక్‌కు వేలంలో అదిరిపోయే ధర పలికింది. గత నెలలో లాస్‌ వేగాస్‌లోని ‘మెకమ్ ఆక్షన్’ సంస్థ నిర్వహించిన వేలంలో సైకిల్‌ను పోలిన ఈ పాతకాలం నాటి బైక్‌కు 9,35,000 డాలర్లు.. భారత కరెన్సీలో 7.72 కోట్ల రూపాయల ధర పలికింది.

ఈ బైక్ పేరు ‘స్ట్రాప్ ట్యాంక్’. దీనికీ పేరు పెట్టడం వెనక ఓ కారణం ఉంది. దీని ఆయిల్, ఇంధన ట్యాంకులు సైకిలు ఫ్రేమ్‌పైన అమర్చారు కాబట్టే దానికి ఆ పేరు పెట్టారు. ప్రపంచంలో ఇలాంటివి 12 మాత్రమే ఉన్నాయి. 1907 నాటి స్ట్రాప్ ట్యాంక్‌ అప్పట్లో 7,15,000 డాలర్లకు అమ్ముడుపోయింది. తాజా స్ట్రాప్ ట్యాంక్ అంతకుమించిన ధరకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది.

ఈ బైక్‌లో ఇప్పటికీ చాలా వరకు ఒరిజినల్ పార్ట్స్ ఉండడం గమనార్హం. ఈ బైక్‌ను తాము బాగా మార్కెట్ చేసినట్టు మెకమ్ వేలంలోని మోటార్ సైకిల్ డివిజన్ మేనేజర్ గ్రెస్ ఆర్నాల్డ్ పేర్కొన్నారు. హార్లే అత్యంత ప్రసిద్ధి చెందిన అమెరికన్ మోటార్ సైకిల్ బ్రాండ్ కాబట్టి వేలంలో మంచి ధర పలుకుతుందని ఊహించినట్టు చెప్పారు.
Harley Davidson
Strap Tank
Las Vegas
Mecum Auction

More Telugu News