Mumbai: జైల్లో నిందితుడిని పెట్టుకుని దేశమంతా 20 ఏళ్లు గాలించిన పోలీసులు!

Mumbai Police hunted for Chotta Shakeel sharpshooter everywhere for 20 years but he was in jail

  • 1999లో బాంబే అమన్ కమిటీ చీఫ్ వాహిద్‌ను కాల్చి చంపిన మహిర్ సిద్ధిఖీ
  • అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితుడిని 2019లో అరెస్ట్ చేసిన పోలీసులు
  • అంతకుముందు అతడు ఐదేళ్లపాటు అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నట్టు గుర్తింపు

ఓ హత్యకేసులో ముంబై పోలీసులు వ్యవహరించిన తీరు ‘చంకలో పిల్లిని..’ సామెతను గుర్తుకు తెస్తోంది. నిందితుడిని జైల్లోనే పెట్టుకుని దేశమంతా గాలించిన తీరు న్యాయమూర్తిని కూడా ఆశ్చర్యపరిచింది. దీనిని ఆయన ‘అన్‌సాల్వ్‌డ్ మిస్టరీ’గా అభివర్ణించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గ్యాంగ్‌స్టర్ చోటా షకీల్ గ్యాంగ్‌కు చెందిన షార్ప్ షూటర్ మహిర్ సిద్ధిఖీ మరో వ్యక్తితో కలిసి 1999లో బాంబే అమన్ కమిటీ చీఫ్ వాహిద్ అలీఖాన్‌ను కాల్చి చంపాడు. ఆ తర్వాత సిద్ధిఖీ పరారయ్యాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిద్ధిఖీ కోసం దేశమంతా గాలించారు. చివరికి 2019లో అతడిని అరెస్ట్ చేశారు. చోటా షకీల్ ఆదేశాలతోనే సిద్ధిఖీ ఆ హత్యకు పాల్పడ్డాడని, అప్పటి నుంచి పరారీలో ఉన్న అతడిని అరెస్ట్ చేసినట్టు కోర్టుకు సమర్పించిన చార్జ్‌షీట్‌లో పోలీసులు పేర్కొన్నారు. మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైం యాక్ట్ కేసుల ప్రత్యేక జడ్జి ఏఎం పాటిల్ దీనిని విచారించారు. 

ఈ సందర్భంగా అసలు విషయం బయటపడింది. సిద్దిఖీని 2019లో పోలీసులు అరెస్ట్ చేయగా, అంతకుముందు అంటే 2014 నుంచి ఐదేళ్లపాటు మరో కేసులో అతడు అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నట్టు గుర్తించారు. అంటే జైల్లోనే ఉన్న నిందితుడి కోసం పోలీసులు 20 ఏళ్లు గాలించారన్నమాట. రికార్డులు పక్కాగా ఉన్నప్పటికీ నిందితుడిని పోలీసులు గుర్తించకపోవడంపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. దీనిని ‘అన్‌సాల్వ్‌డ్ మిస్టరీ’గా అభివర్ణిస్తూ కేసును కొట్టేశారు.

  • Loading...

More Telugu News