CMO: ఏపీ అప్పులపై సీఎం ఆర్థిక వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శి వివరణ
- ఏపీ అప్పులు రూ.4.42 లక్షల కోట్లు అని కేంద్రం చెప్పినట్టు వెల్లడి
- టీడీపీ ఒక్కరోజులోనే రూ.5 వేల కోట్ల అప్పు చేసిందని వివరణ
- ప్రస్తుతం 13 శాతం రుణాలు పెరిగాయని స్పష్టీకరణ
ఏపీ అప్పులపై ముఖ్యమంత్రి ఆర్థిక వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ వివరణ ఇచ్చారు. ఏపీ రుణాలు రూ.4.42 లక్షల కోట్లుగా కేంద్రం పేర్కొందని వెల్లడించారు. అప్పులు రెట్టింపయ్యాయని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు.
2019 ఏప్రిల్ లో టీడీపీ ఒక్కరోజులోనే రూ.5 వేల కోట్లు అప్పు చేసిందని వివరించారు. 2014 తర్వాత టీడీపీ హయాంలో రుణాలు 2.24 రెట్లు పెరిగాయని అన్నారు. గతంలో 19 శాతం రుణాలు పెరగ్గా, ప్రస్తుతం 13 శాతం పెరిగాయని దువ్వూరి కృష్ణ వివరణ ఇచ్చారు.
నాన్ గ్యారంటీ లోన్స్ గతంలోనూ ఉన్నాయని వెల్లడించారు. 2022 సెప్టెంబరు నాటికి రూ.21,673 కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయని తెలిపారు.
పెండింగ్ బిల్లుల గురించి ఆర్థికమంత్రి అసెంబ్లీలో చెప్పారని వివరించారు. కార్పొరేషన్లు ప్రభుత్వం గ్యారంటీలతో రూ.1.27 లక్షల కోట్లు అప్పు పొందాయి అని పేర్కొన్నారు. ప్రస్తుతం ద్రవ్యలోటు రూ.25 వేల కోట్లుగా ఉందని అన్నారు.