Nara Lokesh: ఇది ట్రైలర్ మాత్రమే... సినిమా ముందుంది: నారా లోకేశ్

Lokesh warns CM Jagan and YCP leaders

  • సత్యవేడు నియోజకవర్గంలో లోకేశ్ యువగళం
  • పాదయాత్రకు నేడు 19వ రోజు
  • యుద్ధం ఇప్పుడే మొదలైందన్న లోకేశ్
  • 420 సీఎం అంటూ విమర్శలు

టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 19వ రోజు సత్యవేడు నియోజకవర్గంలో కొనసాగింది. అభిమానులు, కార్యకర్తల కోసం పాదయాత్రకు బయలుదేరేముందు సెల్ఫీ విత్ లోకేశ్ కార్యక్రమంలో లోకేశ్ పాల్గొన్నారు. మొబైల్స్ తీసుకురాని వారికి ఫోటోలు తీసి పంపించే ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని కీలపూడిలో లోకేశ్ సభ జరిగింది. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యుద్ధం ఇప్పుడే మొదలైందని అన్నారు. ఇది ట్రైలర్ మాత్రమేనని... అసలు సినిమా ముందుందని హెచ్చరించారు. తాను చేస్తున్నది పాదయాత్ర కాదు... దండయాత్ర అని స్పష్టంచేశారు. "జగన్ ది అధికార మదం... మనది యువగళం. జగన్ ది పోలీస్ బలం... మనది ప్రజాబలం. నేను ఊరూరా స్టూల్ వేసుకుని మాట్లాడితే ఈ జగన్ లాక్కుంటున్నాడు. నా గొంతులో సౌండ్ ఉన్నంత వరకు ఆయన్ను వదలను. నా మైక్ లాక్కుంటే... నా తరపున 5 కోట్ల ప్రజలు నిన్ను నిలదీస్తారు. జగన్ రెడ్డి తాడేపల్లి కొంప నుండి బయటకు వస్తే ప్రజలు రాళ్లు, టమోటాలు వేస్తారని పరదాలు కట్టుకుని వస్తున్నాడు. మనం దమ్మూ ధైర్యంతో ప్రజల మధ్య నడుస్తున్నాం" అని వివరించారు.

రాణి హత్య జరిగినా భద్రతపై సమీక్ష చేయడంలేదు!

రాష్ట్రంలో నిన్న ఒక దారుణమైన ఘటన జరిగింది. తాడేపల్లిలో రాజు అనే వ్యక్తి గంజాయి మత్తులో రాణి అనే దళిత యువతిని కత్తులతో పొడిచి చంపాడు. ఇంత జరుగుతున్నా మహిళల భద్రతపై సమీక్ష చేయడం లేదు. కానీ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించుకుంటున్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి సరఫరా జరుగుతోంది. సీఎం ఇంటి సమీపంలో హత్య జరగడం ఇది రెండో ఘటన. జగన్ సీఎం అవడం రాష్ట్ర ప్రజల దురదృష్టం. బాధితులు 108కు ఫోన్ చేస్తే అంబులెన్స్ రాలేదు.

జగన్ ఒక 420... అందరినీ మోసంచేశాడు!

చంద్రబాబు మానవత్వం ఉన్న నాయకుడు... జగన్ ఒక 420. ఈ 420 జగన్ సీఎం అయ్యాక మహిళలు, రైతులు, ఉద్యోగులు, యువతును మోసం చేశాడు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 40 వేల పరిశ్రమలతో 6 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఈ 420 జగన్ ఊరూరా తిరిగి 2.30 లక్షల ఖాళీ పోస్టుల భర్తీతోపాటు ఏటా జాబ్ కేలండర్ విడుదల చేస్తా అన్నాడు. జగన్ ఇచ్చిన హామీలు ఒక్కటైనా నిలబెట్టుకున్నాడా? అందుకే 420 అని పేరు పెట్టా. ఢిల్లీ ఎందుకు వెళతాడో తెలీదు...ప్రధానితో ఏం మాట్లాడతాడో తెలీదు.

మద్యనిషేధం ఏమైంది?

సంపూర్ణ మద్యనిషేధం చేశాక ఓట్లు అడుగుతా అన్నాడు. మద్య నిషేధం చేశాడా...? మద్యనిషేధం చేయకపోగా కల్తీ మద్యం పారిస్తున్నాడు. రాత్రి 6 తర్వాత బ్లాక్ లో అమ్మేది కూడా ఈ 420 జగన్ మనుషులే. ఓ తాత వచ్చి జగన్ మద్యం తాగిన 3 నెలలకు డయాలసిస్ కు వచ్చానన్నాడు. ఈ మందును తీసుకెళ్లి ల్యాబ్ లో టెస్టు చేయిస్తే దీనికి పొలంలోని పురుగు మందులు చనిపోతాయని తేలింది. 

రైతులను నట్టేట ముంచాడు!

జగన్ రైతులకు ఎన్నికల ముందు హామీ ఇచ్చాడు. చెరకు ఫ్యాక్టరీలు తెరుస్తా అన్నాడు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు. చంద్రబాబు ఉన్నప్పుడు 4 చెరకు ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి. ఇప్పుడు ఒకటి మాత్రమే నడుస్తోంది. టీడీపీ హయాంలో రూ.50 వేల లోపు ఉన్న రుణాలు మాఫీ చేశాం. రాయలసీమకు డ్రిప్ అందించాం. కార్మికులకు 420 జగన్ తక్కువ ధరకు ఇసుక ఇస్తా అన్నాడు. కానీ 5 రెట్లు ధర పెరిగింది. ఇది కూడా స్థానిక ఎమ్మెల్యే కొట్టేస్తున్నాడు. 

సత్యవేడును దోచేస్తున్న చిత్తూరు వీరప్పన్ పెద్దిరెడ్డి!

సత్యవేడులో ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకరు పెద్దిరెడ్డి, ఇంకొకరు ఆదిమూలం. ఆదిమూలంను చూస్తే జాలేస్తోంది. ఇంకంతా పెద్దిరెడ్డి వద్ద... పెన్నుమాత్రమే ఆదిమూలం వద్ద ఉంది. చిత్తూరుజిల్లా వీరప్పన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం రబ్బర్ స్టాంప్. ఆదిమూలంను అడ్డుపెట్టుకొని పెద్దిరెడ్డి సత్యవేడు నియోజకవర్గాన్ని అడ్డంగా దోచేస్తున్నారు. సత్యవేడు ఎమ్మెల్యే ఎవరు? ఆదిమూలం ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే అని ఎవరికైనా తెలుసా? 

సుగర్ ఫ్యాక్టరీల బకాయిలు విడుదలచేసి ఆదుకుంటాం!

నిండ్ర, బీఎన్ కండ్రిగలో చక్కెర కర్మాగారాలను మూసేశారు. వీటి నుంచి రూ.60 కోట్ల వరకు బకాయిలు రావాలి. 6వేల రైతు కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. బకాయిలు ఇప్పిస్తామని వైకాపా నాయకులు చెప్పినా ఇప్పటి వరకూ ఇది కార్యరూపం దాల్చలేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే చెరకు రైతులకు బకాయిలు విడుదల చేసి ఆదుకుంటాం. 

లోకేశ్ ను కలిసిన అరణ్యంకండ్రిక దాసరి సామాజిక వర్గీయులు

అరణ్యంకండ్రిగ వద్ద పాదయాత్ర దారిలో యువనేత నారా లోకేష్ ను దాసరి సామాజికవర్గ మహిళలు కలిసి వారు తయారుచేసిన గాజులను యువనేతకు చూపించారు. లోకేష్ ఎదుట వారి సాదకబాధలు చెప్పుకున్నారు. గాజుల విక్రయంతో కుటుంబ పోషణ భారమవుతోందంటూ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా లోకేష్ కు వారు వినతిపత్రం సమర్పించారు. అందుకు లోకేశ్ స్పందిస్తూ... టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దాసరి సోదరులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కరానికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు. 

లోకేశ్ ను కలిసిన తుంబూరు ఎస్సీ కాలనీకి చెందిన దళితులు

పాదయాత్ర దారిలో తుంబూరు ఎస్సీ కాలనీకి చెందిన దళితులు లోకేశ్ ను కలిశారు. ఎస్సీ కాలనీల్లో దళితులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కుంటిసాకులతో ఆ రాయితీని తొలగించి భారీఎత్తున బిల్లులు పంపుతోందని ఆవేదన చెందారు. అందుకు లోకేశ్ స్పందిస్తూ...  టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఎటువంటి షరతులు లేకుండా అందిస్తామని స్పష్టం చేశారు.

పాదయాత్ర వివరాలు...

ఇప్పటివరకు నడిచిన దూరం 244.7 కి.మీ
19వ రోజు నడిచిన దూరం 13.4 కి.మీ

రేపటి పాదయాత్ర షెడ్యూలు వివరాలు
20వరోజు - 15-2-2023 (బుధవారం)సత్యవేడు నియోజకవర్గం, తిరుపతిజిల్లా
ఉదయం
8.00 – కీలపూడి (పిచ్చాటూరు మండలం)లోని విడిది కేంద్రంలో ఎస్సీ సామాజికవర్గీయులతో సమావేశం. అనంతరం పాదయాత్ర ప్రారంభం.
9.05– కీలపూడిలో చెరకు రైతులతో సమావేశం.
11.00 – పిచ్చాటూరులో అరణ్య ప్రాజెక్టు వద్ద స్థానికులతో సమావేశం.
మధ్యాహ్నం
12.50 – వెంకటరెడ్డి కండ్రిగలో భోజన విరామం.
1.40 – వెంకటరెడ్డి కండ్రిగలో మహిళలతో ముఖాముఖి సమావేశం.
సాయంత్రం
3.40 – మద్దికండ్రిగ (కెవిబిపురం మండలం)లో స్థానికులతో మాటామంతీ.
4.30 – ఆరాయిలో స్థానికులతో మాటామంతీ.
6.35 – సదాశివపురంలో స్థానికులతో మాటామంతీ.
7.10 – రాయపేడు విడిది కేంద్రంలో బస.

  • Loading...

More Telugu News