leukaemia: చిన్నారుల్లో లుకేమియాని ముందే గుర్తించడం ఎలా?

How to detect leukaemia at an early age in children
  • పిల్లలకు ఎక్కువ వచ్చే కేన్సర్ రకాల్లో లుకేమియా ఒకటి
  • బాగా అలసిపోవడం, బరువు తగ్గిపోవడం, తరచూ ఇన్ఫెక్షన్లు లక్షణాల్లో భాగం
  • ముందే గుర్తిస్తే చికిత్సతో పూర్తిగా నయం
రక్త కేన్సర్ ను లుకేమియా గా పిలుస్తారు. ఏటా మన దేశంలో 75 వేల మంది చిన్నారులు లుకేమియా బారిన పడుతున్నారు. పిల్లల్లో ఎక్కువగా వచ్చే కేన్సర్ రకాల్లో ఇది కూడా ఒకటి. అలాగే, బ్రెయిన్ కేన్సర్ రిస్క్ కూడా పిల్లలకు ఎక్కువే. 

ఎందుకని?
ఎముక మజ్జలో కణాలకు సంబంధించిన డీఎన్ఏ మారిపోతూ, కణాలు మ్యుటేషన్ చెంది అసాధారణ స్థాయిలో పెరిగిపోవడం వల్ల లుకేమియా వస్తుంది. మన శరీరంలో అధిక శాతం రక్తం ఎముక మజ్జలోనే తయారవుతుంది. లుకేమియా ఎందుకు వస్తుందన్న దానికి స్పష్టమైన కారణాలు తెలియవు. రేడియేషన్ కు గురి కావడం, కొన్ని రకాల కెమికల్స్ ప్రభావానికి లోను కావడం, జన్యు సంబంధిత సమస్యలు లుకేమియాకు దారితీయవచ్చు. ముందుగా గుర్తించి, చికిత్స తీసుకోవడమే మెరుగైన మార్గం.

గుర్తించడం ఎలా?
పిల్లల్లో లుకేమియా సమస్య ఉందని కొన్ని రకాల లక్షణాలు చూసి అనుమానించొచ్చు. బాగా అలసిపోయి కనిపిస్తుండడం, జ్వరం, రాత్రి సమయాల్లో బాగా చెమటలు పోయడం, ఇన్ఫెక్షన్లు, శ్వాస సరిగ్గా తీసుకోలేకపోవడం, చర్మం పాలిపోయినట్టు ఉండడం, అసాధారణంగా బరువు తగ్గిపోవడం, మెడ భాగంలోని లింఫ్ నోడ్స్ వాయడం తదితర లక్షణాలు కనిపిస్తే వైద్యులకు తప్పకుండా చూపించాలి. రక్త పరీక్షల సాయంతో సమస్యను గుర్తిస్తారు.

చికిత్స
కీమో థెరపీ, రేడియేషన్ థెరపీ, సర్జరీ లేదా ఎముక మజ్జ మార్పిడి తదితర చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. లుకేమియా రకం, తీవ్రతను బట్టి వైద్యులు చికత్సను నిర్ణయిస్తారు. ఇతర భాగాలకు వ్యాపించిందేమో చూస్తారు. పిల్లల్లో వచ్చే కేన్సర్ ను ముందే గుర్తిస్తే దాన్ని పూర్తిగా నయం చేసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.
leukaemia
blood cancer
kids
symptoms
treatment

More Telugu News