Karnataka Congress: కర్ణాటక అసెంబ్లీలో చెవిలో పువ్వుతో మాజీ సీఎం.. చూడటానికి బాగుందన్న సీఎం!
- కర్ణాటక అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సీఎం బొమ్మై
- చెవుల్లో పూలతో నిరసన తెలిపిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
- వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు కన్నడిగులు చెవిలో పువ్వు పెడతారని బొమ్మై కౌంటర్
కర్ణాటక అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా ఇందుకు కర్ణాటక అసెంబ్లీ వేదికైంది. బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ కాంగ్రెస్ చేపట్టిన నిరసన చర్చనీయాంశమైంది.
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై.. ఆర్థిక మంత్రిగానూ కొనసాగుతున్నారు. ఈ రోజు అసెంబ్లీలో 2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ను విధాన సౌధలో ఆయన ప్రవేశపెట్టారు. అయితే బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సీఎం బొమ్మై సిద్ధమైన సమయంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అప్పటిదాకా ఏదో చదువుకుంటూ కూర్చున్న ప్రతిపక్ష నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య వెంటనే ఆరెంజ్ కలర్ పువ్వు తీసుకుని చెవిలో పెట్టుకున్నారు. సిద్ధరామయ్యను ఫాలో అయిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ వారి చెవుల్లో పూలు పెట్టుకున్నారు.
సిద్ధరామయ్య చెవిలో పువ్వు పెట్టుకోవడం గమనించిన బొమ్మై.. కాంగ్రెస్ నేతలకు కౌంటర్ ఇచ్చారు. ‘‘ఇంతకాలం కాంగ్రెస్ నాయకులు ప్రజలకు చెవిలో పువ్వు పెట్టారు. అందుకే ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ నాయకులకు చెవిలో పువ్వు పెట్టారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కు కన్నడిగులు కచ్చితంగా చెవిలో పువ్వు పెడుతారు. అందులో ఎలాంటి అనుమానం లేదు’’ అని సీఎం ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకుల చెవిలో పూలు చూడముచట్టగా ఉన్నాయని అన్నారు.
బొమ్మై వ్యాఖ్యలపై స్పందించిన సిద్ధరామయ్య.. ‘‘మీరు 7 కోట్ల మంది కర్ణాటక ప్రజల చెవిలో పువ్వులు పెట్టారు. ఇచ్చిన హామీలను ఇంత వరకు నెరవేర్చలేదు. మీరు ప్రజల చెవిలో పువ్వు పెడితే.. మేము మా చెవిలో పువ్వులు పెట్టుకున్నాం’’ అని అన్నారు.