Air New Zealand: 16 గంటల ప్రయాణం తర్వాత.. టేకాఫ్ అయిన చోటే ల్యాండ్ అయిన న్యూజిలాండ్ విమానం!
- ఆక్లాండ్ నుంచి న్యూయార్క్ బయల్దేరిన ఎయిర్ న్యూజిలాండ్ విమానం
- జాన్ ఎఫ్.కెనెడీ విమానాశ్రయంలో విద్యుత్ అంతరాయం..
- విమానాల రాకపోకలపై ఎఫెక్ట్.. యూటర్న్ తీసుకుని వచ్చిన చోటుకే వెళ్లిన విమానం
- అమెరికాలోని మరో ఎయిర్ పోర్టులో ల్యాండ్ కాకపోవడంపై విమర్శలు
దాదాపు 16 గంటలపాటు ప్రయాణం చేసిన విమానం.. టేకాఫ్ తీసుకున్న చోటే తిరిగి ల్యాండ్ అయింది. ఈ ఘటన న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ లో జరిగింది. ఎయిర్ న్యూజిలాండ్ కు చెందిన బోయింగ్ 787 విమానం గురువారం ఆక్లాండ్ నుంచి అమెరికాలోని న్యూయార్క్ కు బయల్దేరింది. జాన్ ఎఫ్.కెనెడీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సి ఉంది.
అయితే అక్కడ విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో ఎయిర్ పోర్టు కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. ఎలక్ట్రికల్ ప్యానెల్ వైఫల్యం, చిన్నపాటి అగ్ని ప్రమాదం వల్ల ఇలా జరిగినట్లు ట్విట్టర్లో విమానాశ్రయం వివరించింది. ఈ ప్రభావం విమానాల రాకపోకలపై పడింది.
దీంతో ఎయిర్ న్యూజిలాండ్ విమానం దాదాపు సగం ప్రయాణం తర్వాత యూటర్న్ తీసుకుంది. ఆక్లాండ్ ఎయిర్ పోర్టులోనే తిరిగి ల్యాండ్ అయింది. టెర్మినల్ లో అగ్నిప్రమాదం కారణంగా ఆక్లాండ్-న్యూయార్క్ విమానాన్ని వెనక్కి మళ్లించవలసి వచ్చిందని ఎయిర్ న్యూజిలాండ్ ఒక ప్రకటనలో తెలిపింది.
అయితే, విమానాన్ని అమెరికాలోని మరో ఎయిర్‌పోర్ట్‌లో ఎందుకు ల్యాండ్ చేయలేదని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. దీనికి స్పందించిన ఎయిర్ న్యూజిలాండ్.. ‘‘మరో ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేయడం వల్ల విమాన వ్యాపార కార్యకలాపాలకు చాలా అంతరాయం ఏర్పడుతుంది. కొన్ని రోజులపాటు విమానం అక్కడే ఉండాల్సి వస్తుంది. దీంతో ఎన్నో షెడ్యూల్ చేసిన సర్వీసులపై ప్రభావం పడుతుంది’’ అని వివరించింది.
ఈ ఘటనపై ట్విట్టర్ లో కొందరు కామెంట్లు చేస్తున్నారు. ‘‘16 గంటలపాటు విమానం ప్రయాణం.. కానీ మీరు ప్రారంభమైన చోటుకే తిరిగి చేరుకున్నారు. ఎంత గొప్ప రోజు’’ అని ఓ యూజర్ ట్వీట్ చేశాడు. ‘‘ట్రెడ్‌మిల్‌పై 16 గంటలు గడిపి.. దాని కోసం చెల్లించడంలా ఉంది’’ అని మరొకరు అసహనం వ్యక్తం చేశారు.