BRS: ఎమ్మెల్యేలకు ఎర కేసులో.. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
- కేసును సీబీఐకి అప్పగించిన తెలంగాణ హైకోర్టు
- హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలన్న టీఎస్ ప్రభుత్వం
- స్టే ఇవ్వడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి షాక్ తగిలింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారంపై దాఖలైన పిటిషన్లను ఈరోజు సుప్రీంకోర్టు విచారించింది. విచారణ పూర్తయ్యేంత వరకు ఎవరినీ అరెస్ట్ చేయకుండా సీబీఐకు ఆదేశాలు ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సీబీఐని తాము నియంత్రించలేమని జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది.
కేసు వివరాల్లోకి వెళ్తే, ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారంపై దర్యాప్తును సీబీఐకి తెలంగాణ హైకోర్టు అప్పగించింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును తెలంగాణ ప్రభుత్వం ఆశ్రయించింది. సీబీఐ చేతిలోకి కేసు వెళ్తే... ఇప్పటి వరకు చేసిన విచారణ అంతా పక్కదారి పడుతుందని టీఎస్ ప్రభుత్వం తరపున సీనియర్ లాయర్లు సిద్ధార్థ లూత్రా, దుష్యంత్ దవేలు వాదనలు వినిపించారు. హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు. అయితే స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.