Nara Lokesh: రేపు శివరాత్రి సందర్భంగా లోకేశ్ పాదయాత్రకు విరామం
- నేడు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర
- నేటికి యువగళానికి 22వ రోజు
- ఉత్సాహంగా ముందుకు సాగుతున్న లోకేశ్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 22వ రోజు (శుక్రవారం) కూడా ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది. లోకేశ్ పాదయాత్ర నేడు బైరాజు కండ్రిక విడిది కేంద్రం నుండి ప్రారంభం కాగా, శివనాథపురం వద్ద శ్రీకాళహస్తి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. శ్రీకాళహస్తి బీపీ అగ్రహారం గంగమ్మ గుడి వద్ద అభిమానులు లోకేశ్ పాదయాత్ర విజయవంతంగా సాగాలని కోరుతూ 101 కొబ్బరికాయలు కొట్టారు.
శ్రీకాళహస్తి పట్టణంలో లోకేశ్ ను చూసేందుకు జనం ఎగబడటంతో పాదయాత్ర నిర్ణీత సమయానికంటే 2 గంటల ఆలస్యంగా సాగింది. కాగా, రేపు మహా శివరాత్రి పర్వదినం కావడంతో లోకేశ్ పాదయాత్రకు ఒక్కరోజు విరామం ప్రకటించారు.
యువగళం దెబ్బకు జగన్ కు జ్వరమొచ్చింది!
యువగళం పాదయాత్రకు ప్రజలనుంచి వస్తున్న అనూహ్య స్పందన చూసి జగన్ కు జ్వరమొచ్చింది... అందుకే పాదయాత్రకు అడగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని లోకేశ్ పేర్కొన్నారు. శ్రీకాళహస్తి వీవీఆర్ గార్డెన్స్ లో జరిగిన బహిరంగసభలో లోకేశ్ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ... పోలీసులు నా సౌండ్ వెహికల్ లాక్కుంటే అవార్డు... మైకు లాక్కుంటే రివార్డు... స్టూల్ లాక్కుంటే ప్రమోషన్ అని జగన్ రెడ్డి ఆఫర్లు పెట్టాడని వ్యంగ్యం ప్రదర్శించారు. "నన్ను శ్రీకాళహస్తి ఆలయానికి కూడా వెళ్లొద్దని పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. జగన్ రెడ్డి పిరికివాడు గనుకనే ఖాకీలను అడ్డుపెట్టుకుని నా పాదయాత్రను అడ్డుకుంటున్నాడు" అని విమర్శించారు.
జగన్ రెడ్డి ఒక గజనీ!
జగన్ రెడ్డి ఓ గజినీ అని, అబద్దాలు తప్ప నిజాలు మాట్లాడే అలవాటు ఆయనకు లేదని లోకేశ్ విమర్శించారు. "25 మంది ఎంపీలను ఇస్తే ఏపీకి ప్రత్యేక హోదా తెస్తానని హామీ ఇచ్చి 31 మంది ఎంపీలున్నారని మరచిపోయాడు... ఎందుకంటే జగన్ ఓ గజినీ కనుక. ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి వారంలోనే సీపీఎస్ రద్దు చేస్తానన్నాడు... 3 సంవత్సరాల 8 నెలలు గడిచినా చేయలేదు.
ఎన్నికల ముందు అమరావతే రాజధాని అన్నాడు... ఇప్పుడు ఎక్కడికి వెళితే అక్కడే రాజధాని అని వాగుతున్నాడు. కడప ఉక్కు ఫ్యాక్టరీకి 2019లో 20వేల మందికి ఉద్యోగాలిస్తానని శంకుస్థాపన చేశాడు....నిన్న మరోసారి శంకుస్థాపన చేస్తూ 6 వేల మందికే ఉద్యోగాలు అన్నాడు... అందుకే జగన్ ను గజినీ అనేది" అంటూ ఎద్దేవా చేశారు.
అంబులెన్స్ సౌకర్యం కూడా కల్పించలేని దద్దమ్మ జగన్ రెడ్డి!
విశాఖలో రాజు, మహేశ్వరీల 15రోజుల శిశువు చనిపోతే ఆ మృతదేహాన్ని పాడేరు తరలించడానికి అంబులెన్స్ ఇవ్వలేని దద్దమ్మ గజినీ జగన్ రెడ్డి అంటూ లోకేశ్ మండిపడ్డారు అవగాహన లేని సైకో సీఎం అయితే రాష్ట్రానికి ఎటువంటి పరిస్థితులొస్తాయో ఈ ఘటనలు అద్దం పడుతున్నాయని అన్నారు.
గజనీరెడ్డికి మ్యాటర్ వీక్... పబ్లిసిటీ పీక్!
"గజినీ జగన్ కు పబ్లిసిటీ పీక్...మ్యాటర్ వీక్. జగన్ రెడ్డి రాయలసీమ బిడ్డ అంటూ పాటలు రాయించి మన చెవుల్లో వాయించాడు. ఇతను హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తిచేయలేకపోయాడు. కేంద్రం రూ.5,300కేటాయించి అప్పర్ తుంగభద్ర ప్రాజెక్టు కడుతుంటే వైసీపీ ఎంపీలెవరూ నోరెత్తిన పాపాన పోలేదు. 20వేల మందికి ఉద్యోగాలిచ్చే అమర్ రాజా బ్యాటరీ కంపెనీని గజినీ జగన్ తరిమేశాడు. నేను రిలయన్స్ కంపెనీని శ్రీకాళహస్తికి తెస్తే దాన్నీ పక్క రాష్ట్రానికి తరిమేశాడు" అని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బడాచోర్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి!
ఈ సైకో జగన్ జిల్లాకొక సైకోను తయారుచేసి పెట్టాడని లోకేశ్ వ్యాఖ్యానించారు. "శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి బడా చోర్(పెద్దదొంగ). రేణిగుంట ఎమ్మార్వో శివప్రసాద్, మధుసూధన్ రెడ్డి కలిసి ప్రభుత్వ భూమి, చెరువును కబ్జా చేశారు. ప్రజల కోసం చేసిందేమీ లేదు కానీ.... ఈ 3 సంవత్సరాల 8 నెలల కాలంలో ఎమ్మెల్యే మాత్రం రూ.2వేల కోట్లు దోచుకున్నాడు. నియోజకవర్గాన్ని కేకులాగా ముక్కలు ముక్కలుగా కోసి పంచుతున్నాడు" అని ఆరోపించారు.
రేణిగుంటలో కలెక్షన్ కింగులు!
రేణిగుంట లో ఓ మండలాన్ని ఎమ్మెల్యే కూతురు పవిత్రారెడ్డి, ఏర్పేడు మండలాన్ని ఎమ్మెల్యే తమ్ముడికి, సిటీని ఎమ్మెల్యే దోచుకుంటున్నారని లోకేశ్ పేర్కొన్నారు. వీళ్ల ముగ్గురు రాత్రిపూట కూర్చుని కలెక్షన్ల గురించి మాట్లాడుకుంటున్నారని అన్నారు.
"స్వర్ణముఖి నదిలో ఇసుకను దోచుకుంటున్నాడు... ప్రశ్నిస్తే రైతులపై కేసులు పెడుతున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒకరు గతంలో 40 ఎకరాలు రూ.60 లక్షలు పెట్టి కొన్నాడు. నేడు దాని విలువ రూ.4కోట్లు అయ్యింది. దీన్ని బడాచోర్ మధుసూదన్ రెడ్డి దోచుకోవాలని చూస్తున్నాడని ఆ వ్యాపారి నాతో చెప్పి ఆవేదన చెందాడు. శ్రీకాళహస్తి దోపిడీకి అడ్డాగా మారిపోయింది" అని వివరించారు.
బొజ్జల ఎమ్మెల్యేగా ఉన్నపుడే శ్రీకాళహస్తి అభివృద్ధి
బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అవినీతి రహిత పరిపాలన జరిగిందని లోకేశ్ తమ టీడీపీ నేతను గుర్తు చేశారు. 3,552 టిడ్కో ఇళ్లు కట్టిన వ్యక్తి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అని వెల్లడించారు. "అతను కట్టిన ఇళ్లను వైసీపీ ఇవ్వడం లేదు. వాటిలో కిటికీలు, తలుపులను దొంగలు దోచుకుంటున్నారు" అని మండిపడ్డారు. గజినీ, బడాచోర్ పని అయిపోయింది... రానున్న కాలంలో అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేని లోకేశ్ ఉద్ఘాటించారు.
"ఆలయాల్లో జరిగే దందాలకు చెక్ పెడతాం. స్వర్ణముఖి నది దగ్గర వాటర్ ప్లాంట్ నెలకొల్పుతాం. శ్రీకాళహస్తి ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుదాం. రోడ్లు, డ్రైన్లు, ఇతర పనులను యుద్ధప్రాతిపదిన పూర్తిచేస్తాం. సోమశిల, స్వర్ణముఖి ప్రాజెక్టులను పూర్తిచేస్తాం. అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమ కేసులపై జ్యుడిషియల్ ఎంక్వయిరీ వేయిస్తా... అవినీతి అధికారుల తాట తీస్తా. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి అఖండ మెజారిటీతో గెలిపించండి...మీకు నేను అండగా ఉంటా" అంటూ లోఏశ్ భరోసా ఇచ్చారు.
యువనేతను కలసిన ఆటో డ్రైవర్లు
శ్రీకాళహస్తిలో పాదయాత్ర దారిలో యువనేతను ఆటో కార్మికులు కలిశారు. పట్టణంలో తమకు ఆటో స్టాండ్ లేదని, పోలీసులు అకారణంగా ఫైన్లతో వేధిస్తున్నారని వాపోయారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందడం లేదని, పెరిగిన పెట్రోలు డీజిల్ ధరలు భారంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.
అందుకు లోకేశ్ స్పందిస్తూ... టీడీపీ అధికారంలోకి రాగానే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఆటోస్టాండ్లు అభివృద్ధి చేస్తామని,. పోలీసుల వేధింపులు లేకుండా చూస్తామని స్పష్టం చేశారు., ఆటోడ్రైవర్ల సంక్షేమానికి కృషిచేస్తామని భరోసా ఇచ్చారు.
లోకేశ్ ను కలిసిన భవన నిర్మాణ కార్మికులు
పాదయాత్ర దారిలో యువనేతను భవన నిర్మాణ కార్మికులు కలిశారు. ఇసుక అందుబాటులో లేక జీవనోపాధి లేకుండా పోయిందని అన్నారు. సిమెంటు, ఇనుమురేట్లు కూడా విపరీతంగా పెరిగాయని, ప్రమాద బీమా అందడం లేదని తెలిపారు. తమకు సొంత ఇళ్లు లేవని, పక్కా ఇళ్లు ఇప్పించాలని కోరారు.
అందుకు లోకేశ్ స్పందిస్తూ... టీడీపీ హయాంలో ఉచిత ఇసుక పాలసీని అమలుచేశామని చెప్పారు. గతంలో కేవలం రూ.1500కు ఇంటికి చేరే ఇసుక, ఇప్పుడు రూ. 5వేలు అయిందని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పాత ఇసుక పాలసీ తెస్తామని స్పష్టం చేశారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమనిధిని వారి సంక్షేమానికే వినియోగిస్తామని, అందరికీ పనులు లభించేలా చూస్తామని హామీ ఇచ్చారు.
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు*
*ఇప్పటి వరకు నడిచిన దూరం – 296.6 కి.మీ.*
*22వ రోజు (17-2-2023) నడిచిన దూరం 18.1 కి.మీ.*
========
*18-2-2023న శివరాత్రి సందర్భంగా పాదయాత్రకు విరామం.*
========