George soros: వృద్ధుడు, ధనికుడు, ప్రమాదకారి.. బిలియనీర్ జార్జ్ సోరోస్‌పై విదేశాంగ మంత్రి జయశంకర్ విమర్శ
- బిలియర్ జార్జ్ సోరోస్ వ్యాఖ్యలపై భారత్‌లో సద్దుమణగని దుమారం
- సోరోస్ ప్రమాదకారి అన్న విదేశీవ్యవహారాల మంత్రి జయశంకర్
- ఎన్నికల ఫలితం అనుకూలంగా లేకపోతే ప్రజాస్వామ్యాన్ని సందేహిస్తారంటూ వ్యాఖ్య
‘హిండెన్‌బర్గ్’ ఉదంతంతో భారత్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరగొచ్చంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బిలియనీర్ ఇన్వెస్టర్ జార్జ్ సోరోస్‌పై విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జయశంకర్ తాజాగా మండిపడ్డారు. ఎన్నికల్లో తమకు అనుకూల ఫలితాలు రానప్పుడు సోరోస్ లాంటి వ్యక్తులు ప్రజాస్వామ్య వ్యవస్థలపై సందేహాలు లేవనెత్తుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జార్జ్ సోరోస్.. వృద్ధుడు, ధనికుడే కాకుండా ప్రమాదకారి అని కూడా జయశంకర్ పేర్కొన్నారు. దేశంలో జరిగే చర్చను ప్రభావితం చేసేందుకు ఇటువంటి వారు నిధులు మళ్లించొచ్చని చెప్పుకొచ్చారు. ఆస్ట్రేలియాలో జరిగిన ఓ కార్యక్రమంలో విదేశీ వ్యవహారాల మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
హంగేరీలో పుట్టిన జార్జ్ సోరోస్ ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. ఇక, అదానీ గ్రూప్ అప్పులకుప్పగా మారిందన్న హిండెన్ బర్గ్ నివేదికపై భారత ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ఇటీవల ఆయన ప్రశ్నించడం భారత్‌లో తీవ్రవివాదానికి దారితీసింది. భారత పార్లమెంటుకు, విదేశీ ఇన్వెస్టర్లకు మోదీ సమాధానం చెప్పకతప్పదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అక్కడితో ఆగక..హిండెన్ బర్గ్ నివేదికతో భారత్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరగొచ్చని పేర్కొన్నారు. దీంతో.. జార్జ్ సోరోస్.. భారత ప్రజాస్వామ్య ప్రక్రియల్లో జోక్యం చేసుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.