Team India: కోహ్లీ, జడేజా కూడా ఔట్.. ఇక ఆశలన్నీ తెలుగు క్రికెటర్ పైనే
- 135 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయిన టీమిండియా
- రాహుల్, రోహిత్, పుజారా, శ్రేయస్, జడేజా, కోహ్లీ ఔట్
- లైయన్ కు నాలుగు, మర్ఫికి ఓ వికెట్
ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో భారత్ కష్టాల్లో పడింది. బౌలర్లు అదరగొట్టి ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసినా, బ్యాటర్లు నిరాశ పరుస్తున్నారు. 135 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. ఓవర్ నైట్ స్కోరు 21/0తో మూడో రోజు ఆట కొసాగించిన ఆతిథ్య జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. 46 పరుగుల స్కోరు వద్ద కేఎల్ రాహుల్ (17) ఔటయ్యాడు. ఆ వెంటనే ఒకే ఓవర్లో రోహిత్ శర్మ (32)తో పాటు చతేశ్వర్ పుజారా (0) పెవిలియన్ చేరాడు. కెరీర్ లో వందో టెస్టు ఆడుతున్న పుజారా డకౌట్ గా వెనుదిరిగాడు. కొద్దిసేపటికే శ్రేయస్ అయ్యర్ (4) సైతం పెవిలియన్ చేరాడు.
ఈ క్రమంలో విరాట్ కోహ్లీ (44), రవీంద్ర జడేజా (26) ఐదో వికెట్ కు 59 పరుగులు జోడించి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ, తొలి సెషన్ లో విజృంభించిన లైయన్ కు ఇతర స్పిన్నర్లు టాడ్ మర్ఫి, కునేమన్ తోడయ్యారు. జడేజాను ఔట్ చేసిన మర్ఫి ఈ జోడీని విడదీశాడు. ఇక, అర్ధ సెంచరీకి చేరువైన కోహ్లీని కునెమన్ ఎల్బీగా ఔట్ చేశాడు. ప్రస్తుతం క్రీజులో ఉన్న తెలుగు క్రికెటర్ కేఎస్ భరత్ కు తోడు అశ్విన్, అక్షర్ పటేల్ రాణిస్తేనే భారత్ కోలుకోగలదు. కాగా, తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 263 పరుగులకు ఆలౌటైంది.