Somu Veerraju: వైసీపీ వివాదాస్పద ట్వీట్.. తొలగించాల్సిందేనన్న సోము వీర్రాజు

jagan should ask apology to hindus demands somu veerraju on a disturbing poster
  • బాల శివుడికి జగన్ పాలు పట్టిస్తున్నట్లుగా ఉన్న పోస్టర్‌ను తొలగించాలని సోము వీర్రాజు డిమాండ్
  • రాష్ట్రవ్యాప్తంగా శివాలయాల వద్ద ఆందోళనలకు పిలుపు
  • వైసీపీ హిందువులను ఉద్దేశపూర్వకంగా అవమానించిందని మండిపాటు
శివరాత్రి సందర్భంగా వైసీపీ ట్వీట్ చేసిన ఒక ఫొటో వివాదాస్పదమవుతోంది. బాల శివుడికి జగన్ పాలు పట్టిస్తున్నట్లుగా ఉన్న పోస్టర్‌ను వైసీపీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనిపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. హిందువులను హేళన చేస్తున్నట్లుగా చిత్రాన్ని ప్రదర్శించారంటూ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

వివాదాస్పద పోస్టర్‌ను వైసీపీ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి వెంటనే తొలగించాలని, ముఖ్యమంత్రి జగన్ బేషరతుగా హిందువులకు క్షమాపణ చెప్పాలని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా శివాలయాల వద్ద ఆందోళనలకు పిలుపునిచ్చినట్లు చెప్పారు. వైసీపీ హిందువులను ఉద్దేశపూర్వకంగా అవమానించిందని, అందుకే నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు.

శివరాత్రిని పురస్కరించుకుని శనివారం ఒక ఫోటోను వైసీపీ ట్వీట్ చేసింది. అందులో పంచకట్టులో ఉన్న జగన్.. చిన్నారికి పాలు తాగిస్తున్నారు. చిన్నారి చేతిలో ఉన్న వస్తువు, చిరుతపులి తోలును పోలిన దుస్తులు, పక్కనే ఉన్న నందిని చూస్తే.. బాల శివుడికి జగన్ పాలు తాగిస్తున్నట్లుగా ఉంది.

ఆ ట్వీట్ కు.. ‘‘అన్నార్తుల ఆకలి తీర్చడమే ఈశ్వరారాధాన. ఆ శివయ్య చల్లని దీవెనలు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ.. శివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు’’ అని వైఎస్సార్ సీపీ పేర్కొంది.
Somu Veerraju
YS Jagan
YSRCP
YSR Congress Party twitter
BJP

More Telugu News