Amit Shah: అమిత్ షా నా వెనుక కొండలా నిలబడ్డారు.. ఏక్ నాథ్ షిండే
- కేంద్ర మంత్రి అమిత్‌షా తనకు ఇచ్చిన మాట నిలుపుకొన్నారన్న ఏక్ నాథ్ షిండే
- తన వెంటే బలంగా నిలబడ్డారని వెల్లడి
- శివసేన పేరు, పార్టీ గుర్తు తమకే ఈసీ కేటాయించిన నేపథ్యంలో వ్యాఖ్యలు
ఏక్‌నాథ్ షిండే వర్గానికి శివసేన పేరు, పార్టీ గుర్తు 'విల్లు-బాణం' చెందుతుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తనకు ఇచ్చిన మాట నిలుపుకొన్నారని, తన వెంటే బలంగా నిలబడ్డారని చెప్పారు.
‘‘షిండేజీ.. మీరు ముందుకు వెళ్లండి.. మీ వెనుకాల మేము కొండలా నిలబడతాం అని అమిత్‌షా నాతో చెప్పారు. ఆయన చెప్పిందే చేశారు. తన మాట నిలుపుకొన్నారు’’ అని ఏక్ నాథ్ షిండ్ అన్నారు.
గత ఏడాది జూన్‌లో ఏక్‌నాథ్ షిండే వర్గం అప్పటి మహా వికాశ్ అఘాడీ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసింది. శివసేనలోని 40 మంది ఎమ్మెల్యేలను, 13 మంది ఎంపీలను షిండే తన వైపు తిప్పుకున్నారు. దీంతో ఉద్ధవ్ థాక్రే సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కుప్పకూలింది. తర్వాత బీజేపీతో పొత్తుపెట్టుకుని మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని షిండే ఏర్పాటు చేశారు. షిండే ముఖ్యమంత్రిగా, దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
పార్టీ గుర్తు, పేరు తమకే చెందాలంటూ ఉద్ధవ్, షిండే వర్గాలు ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించగా.. వాటిని షిండే వర్గానికే ఈసీ కేటాయించింది. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది మద్దతు షిండే వర్గానికే ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.