Ravindra Jadeja: ఢిల్లీ టెస్టులో ఆసీస్ ఆటగాళ్లు ఎక్కడ తప్పు చేశారో చెప్పిన జడేజా
- రెండో టెస్టులో భారత్ ఘనవిజయం
- రెండున్నర రోజుల్లోనే ముగిసిన మ్యాచ్
- రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి 10 వికెట్లు తీసిన జడేజా
భారత పర్యటనలో ఆస్ట్రేలియా జట్టుకు ఏదీ కలిసి రావడంలేదు. తొలి టెస్టులో భారీ ఓటమి నేపథ్యంలో, ఢిల్లీలో జరిగిన రెండో టెస్టులో టాస్ గెలిచినా ఫలితం మారలేదు. స్పిన్ బౌలింగ్ ను దీటుగా ఎదుర్కొనేందుకు సిరీస్ ప్రారంభానికి ముందు తీవ్రస్థాయిలో చేసిన కసరత్తులు... అసలు మ్యాచ్ ల్లోకి వచ్చేసరికి తేలిపోయాయి. నాగపూర్ టెస్టు తరహాలోనే రెండో టెస్టు కూడా రెండున్నరోజుల్లోనే ముగిసింది.
ఢిల్లీ వేదికగా జరిగిన ఈ టెస్టులో రెండు ఇన్నింగ్స్ లో కలిపి మొత్తం 10 వికెట్లు తీసిన లెఫ్టార్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా ఆసీస్ పాలిట విలన్ గా పరిణమించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత జడేజా మాట్లాడుతూ, ఢిల్లీ టెస్టులో ఆసీస్ ఆటగాళ్లు ఎక్కడ తప్పు చేశారో వివరించాడు.
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం పిచ్ చాలా స్లోగా మారిందని, బంతి కూడా తక్కువ ఎత్తులో వస్తోందని వెల్లడించాడు. ఇలాంటి పిచ్ పై ఆసీస్ ఆటగాళ్లు స్వీప్ షాట్లు కొట్టేందుకు ప్రయత్నించి బోల్తాపడ్డారని తెలిపాడు. ఈ మ్యాచ్ కోసం ఆసీస్ ఆటగాళ్ల షాట్ల ఎంపిక లోపభూయిష్టంగా ఉందని జడేజా పేర్కొన్నాడు.
తన బౌలింగ్ శైలికి ఈ పిచ్ అతికినట్టు సరిపోయిందని చెప్పుకొచ్చాడు. కొన్ని బంతులు విపరీతంగా స్పిన్ అయితే, మరికొన్ని తక్కువ ఎత్తులో వచ్చాయని వెల్లడించాడు. ఆసీస్ ఆటగాళ్లు స్వీప్ షాట్లు, రివర్స్ స్వీప్ లు ఆడుతుండడంతో తక్కువ స్పిన్ తో, సూటిగా బౌలింగ్ చేసేందుకు ప్రాధాన్యత ఇచ్చానని తెలిపాడు.
ఆసీస్ ఆటగాళ్లు పరుగుల కోసం ప్రయత్నిస్తుండడంతో, స్టంప్స్ కు గురిపెట్టి బౌలింగ్ వేయడం మంచి ఫలితాన్ని ఇచ్చిందని జడేజా వివరించాడు. ఇలాంటి పిచ్ పై ఆసీస్ ఆటగాళ్లు స్వీప్ షాట్లకు ప్రయత్నిస్తుండడంతో తమ పని సులువైందని పేర్కొన్నాడు.
తొలి టెస్టులో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచిన జడేజా... వరుసగా రెండో టెస్టులోనూ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కైవసం చేసుకోవడం విశేషం.