CVhiranjeevi: 'సాగరసంగమం' నేను చేయవలసిన సినిమా: జయసుధ
- ఈ రోజున దర్శకుడు విశ్వనాథ్ జయంతి
- ఆయనను స్మరించుకునే వేడుకగా 'కళాతపస్వికి కళాంజలి'
- హాజరైన పలువురు సినీ ప్రముఖులు
- తనపై విశ్వనాథ్ గారు అలిగారన్న జయసుధ
కళాతపస్వి కె. విశ్వనాథ్ ఇటీవల ఈ లోకాన్ని వీడి వెళ్లారు. ఆయనను అభిమానించే ఎంతోమంది అభిమానులతో కన్నీళ్లు పెట్టించారు. ఈ రోజున విశ్వనాథ్ జయంతి కావడంతో, ఆయనను స్మరించుకుంటూ 'కళాతపస్వికి కళాంజలి' అనే పేరుతో హైదరాబాదులో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు పలువురు సినీప్రముఖులు హాజరయ్యారు.
ఈ వేదికపై జయసుధ మాట్లాడుతూ ... "ఎంతోమంది హీరోయిన్స్ విశ్వనాథ్ గారితో మంచి మంచి సినిమాలు చేశారు .. కానీ జయసుధ ఎందుకు చేయలేదు అని మీ అందరికీ అనిపించి ఉంటుంది. విశ్వానాథ్ గారు తీసిన 'కాలాంతకులు' .. 'అల్లుడు పట్టిన భరతం' వంటి కమర్షియల్ సినిమాలను నేను చేశాను" అన్నారు.
'సాగర సంగమం' సినిమాను నేను చేయవలసింది .. ఏడిద నాగేశ్వరరావు గారు నాకు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. కమల హాసన్ గారు బిజీగా ఉండటం వలన ఆ సినిమా ఆలస్యమైంది. అదే సమయంలో నేను ఎన్టీఆర్ గారితో సినిమా చేయవలసి ఉండటంతో డేట్స్ కుదరలేదు. 'సాగర సంగమం' సినిమా కోసం తీసుకున్న అడ్వాన్స్ ను వెనక్కి ఇచ్చేశాను. దాంతో విశ్వనాథ్ గారు అలిగారు" అని చెప్పారు.
"నా పట్ల ఆయన అలక చాలా ఏళ్లపాటు అలాగే ఉండిపోయింది. ఆ తరువాత నాతో ఆయన ఏ సినిమాలు తీయలేదు. నిజం చెప్పాలంటే 'సాగరసంగమం'లో ఆ పాత్రకి జయప్రదనే కరెక్ట్ అని నాకు అనిపించింది. ఆ తరువాత చాలా కాలానికి ఆయన యాక్టర్ అయిన తరువాత, నాకు ఒక కథను చెప్పి తనతో యాక్ట్ చేయమని అడిగారు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. కానీ ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు" అంటూ ఆనాటి విషయాలను గుర్తుచేసుకున్నారు.