Posani Krishna Murali: తండ్రి ఆత్మహత్యను తలచుకుని ఇంటర్వ్యూలోనే ఏడ్చేసిన పోసాని!
- రచయితగా మంచి పేరు తెచ్చుకున్న పోసాని
- దర్శకుడిగా .. నటుడిగా కూడా సక్సెస్
- ముక్కుసూటిగా మాట్లాడటం ఆయన నైజం
- తన గతాన్ని తలచుకుని ఉద్వేగానికి లోనైన పోసాని
పోసాని కృష్ణమురళి .. పరిచయం అవసరం లేని పేరు. రచయితగా .. దర్శకుడిగా .. నటుడిగా తనదైన మార్క్ చూపించినవారాయన. తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన తన తల్లిదండ్రులను గురించి ప్రస్తావించారు. "మా నాన్న చాలా మంచివాడు ... చూడటానికి గుమ్మడిగారిలా ఉండేవాడు. ఆయనకి ఎలాంటి చెడు అలవాట్లు ఉండేవి కాదు. కానీ కొంతమంది ఆయనకి పేకాట అలవాటు చేశారు" అన్నారు.
"పేకాట పిచ్చిలోపడి ఆయన అన్నీ పోగొట్టాడు. ఇల్లు కడదామని మొదలుపెట్టాడు. .. కానీ అది కూడా మధ్యలోనే ఆగిపోయింది. అప్పులు కట్టలేక .. పిల్లల్ని చదివించుకోలేక పోతున్నాననే బాధతో పొలానికి వెళ్లి అక్కడ పురుగుల మందును తాగేశాడు. ఆ పొలం గట్ల పైనే పడి చనిపోయాడు. అప్పుడు ఏడవాలని కూడా నాకు తెలియదు " అంటూ ఏడ్చారు.
"మా ఊళ్లో మంచి ఇల్లు కట్టి .. అమ్మానాన్న తిరగడానికి ఒక కారు కొనాలని నాకు ఉండేది. కానీ వాళ్లు నా సంపాదన తినలేదు. అది తలచుకుంటేనే ఇంకా ఎక్కువ బాధగా ఉంది. మద్రాసులో నాకు నెలకి 15 వందలు వస్తున్నప్పుడే అమ్మకి చీరలు కొని పంపించేవాడిని. అవి ఆమె కట్టుకుని మా అబ్బాయి కొనిపెట్టాడని చెబుతూ అందరికీ చూపించుకునేది" అంటూ ఉద్వేగానికి లోనయ్యారు.