Vishvanath: విశ్వనాథ్ గారి సినిమా నన్ను చాలా భయపెట్టేసింది: నటి రోజారమణి
- ' ఓ సీతకథ' గురించి ప్రస్తావించిన రోజా రమణి
- విశ్వనాథ్ గారు తనకి ఛాన్స్ ఇస్తారనుకోలేదంటూ వెల్లడి
- రిలీజ్ రోజున చాలా టెన్షన్ పడ్డానని వివరణ
- ఆ సినిమా పెద్ద హిట్ అయిందని చెప్పిన రోజా రమణి
బాలనటిగా వెండితెరకి పరిచయమైన రోజా రమణి, ఆ తరువాత కాలంలో హీరోయిన్ గా .. కేరక్టర్ ఆర్టిస్టుగా .. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మంచి పేరు సంపాదించుకున్నారు. తాజా ఇంటర్వ్యూలో రోజా రమణి మాట్లాడుతూ .. " ఆ రోజుల్లో విశ్వనాథ్ గారి దర్శకత్వంలో ఒక్క సినిమా చేసినా చాలనే ఆశతో చాలామంది హీరోయిన్స్ వెయిట్ చేసేవారు. నా వయసు 16 కావడంతో ఆయన సినిమాల్లో ఛాన్స్ వస్తుందని నేను అనుకునేదాన్ని కాదు" అన్నారు.
"అయితే ఒక రోజు విశ్వనాథ్ గారి నుంచి కబురు వస్తే వెళ్లి కలిశాను. ఆయన ఒక కథను నాకు వినిపించారు. ఆ కథ వినగానే నాకు కన్నీళ్లు వచ్చాయి. ఆ సినిమానే 'ఓ సీతకథ'. ఆ సినిమాలో ఫస్టాఫ్ లో 16 ఏళ్ల అమ్మాయిగా కనిపించాలి .. సెకండాఫ్ లో 60 ఏళ్ల వయసు పాత్రలో చేయాలి. ఇది సావిత్రి గారి స్థాయికి తగినవారు చేసే పాత్ర అని విశ్వనాథ్ గారు ముందుగానే చెప్పారు" అన్నారు.
" ఆ రోజునే విశ్వనాథ్ గారు ఆ రెండు లుక్స్ కి సంబంధించిన మేకప్ వేయించి స్టిల్స్ తీయించారు. అవి చూసిన తరువాత 'ఈ అమ్మాయినే ఈ పాత్రకి కరెక్ట్' అన్నారు. అలా ఆ సినిమా చేయడం జరిగింది. ఇక రిలీజ్ రోజున నేను పడిన టెన్షన్ అంతా ఇంతా కాదు. ఈ రెండు పాత్రలలో నన్ను ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారా అనే ఆందోళన పెరిగిపోయింది. ఆ తరువాత ఆ సినిమా పెద్ద సక్సెస్ కావడం .. నాకు నంది అవార్డు రావడం మీకు తెలిసిందే" అని చెప్పుకొచ్చారు.