S.Jaishankar: భారత విదేశాంగ మంత్రి చెప్పింది కరక్టే.. మా మైండ్‌సెట్ మారాలి: జర్మనీ ఛాన్స్‌లర్
- మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో మంత్రి ఎస్.జయ్‌శంకర్ ప్రస్తావన
- ‘ఐరోపా’ మైండ్‌సెట్ మారాలన్న జయ్‌శంకర్ వ్యాఖ్య సబబేనన్న జర్మనీ ఛాన్స్‌లర్
- సమస్యల పరిష్కారానికి ఐరోపా దేశాలు మిగిలిన దేశాలతో కలిసి పనిచేయాలని సూచన
ఐరోపా దేశాల తీరులో మార్పు రావాలంటూ గతంలో భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జయశంకర్ చేసిన వ్యాఖ్యలు సబబేనని జర్మనీ ఛాన్స్‌లర్ ఓలాఫ్ షొల్జ్ తాజాగా పేర్కొన్నారు. అంతర్జాతీయ భద్రతాంశాలపై ఇటీవల జరిగిన మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బలవంతులు చెప్పిందే న్యాయం అన్న పరిస్థితులు నెలకొంటే అది ఐరోపా దేశాలకూ సమస్యేనని చెప్పారు. ఉమ్మడి విలువల గురించి ఐరోపా దేశాలు పదే పదే ప్రస్తావించడం వాటి విశ్వసనీయత పెంచేందుకు సరిపోదని కుండబద్దలు కొట్టారు. అంతర్జాతీయ సమావేశాల్లో ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలకు కేవలం ప్రాతినిధ్యం కల్పిస్తే సరిపోదని తేల్చి చెప్పారు. పేదరికం, ఆకలిని రూపుమాపేందుకు ఆయా దేశాలతో ఐరోపా దేశాలు కలిసి పనిచేయాలని జర్మనీ ఛాన్సలర్ అభిప్రాయడ్డారు.
గతేడాది స్లోవేకియాలో జరిగిన గ్లోబ్‌సెక్ బ్రాటిస్లావా ఫోరమ్ చర్చల్లో పాల్గొన్న భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయ్‌శంకర్..ఐరోపా మైండ్‌సెట్ మారాలని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. రష్యా యుద్ధంపై భారత్ వైఖరి ఏమిటని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు ఘాటుగా సమాధానం ఇచ్చారు. ‘‘తమ సమస్యలు ప్రపంచ దేశాల సమస్యలని ఐరోపా దేశాలు భావిస్తుంటాయి. కానీ..ప్రపంచం సమస్యలు తమవి కావన్నట్టు ఉంటాయి. ఈ మైండ్‌సెట్‌లో మార్పు రావాలి’’ అంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వైరల్ అయ్యాయి.