Raghu Rama Krishna Raju: వివేకాను ఎవరు హత్య చేశారనేది తేలింది.. విజయసాయిరెడ్డిలో మార్పు కనిపిస్తోంది: రఘురామకృష్ణరాజు
- వివేకాను హత్య ఎవరు చేయించారనేదే తేలాల్సి ఉందన్న రఘురాజు
- కన్నా టీడీపీలో చేరడం తమ పార్టీకి దెబ్బేనని వ్యాఖ్య
- విజయసాయి ట్వీట్లలో చాలా మార్పు ఉందన్న రఘురాజు
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకాను ఎవరు హత్య చేశారనే విషయం సీబీఐ విచారణలో ఇప్పటికే తేలిందని, దీనికి సంబంధించి స్పష్టంగా ఫైల్ చేశారని... హత్య చేయించిన వారు ఎవరనే విషయం మాత్రమే తేలాల్సి ఉందని అన్నారు. వివేకా శరీరానికి కుట్లు ఎవరు వేశారు, రక్తాన్ని ఎవరు శుభ్రపరిచారు అనేది తేలాలని చెప్పారు. విచారణకు హాజరు కావాలంటూ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి రెండోసారి సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చారంటే... ఆయన విషయంలో ఊహించని పరిణామాలు జరగబోతున్నాయనే అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. ఈ హత్యకు సంబంధించి మరో రెండు, మూడు అరెస్టులు జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
ఏపీలో బలమైన కాపు నేతల్లో కన్నా లక్ష్మీనారాయణ ఒకరని రఘురాజు చెప్పారు. ఆయన టీడీపీలో చేరుతుండటం పెద్ద రాజకీయ పరిణామమని అన్నారు. ప్రతిపక్షంలో కన్నా చేరితే తమ పార్టీకి ఇబ్బందేనని చెప్పారు. తమ పార్టీ వైసీపీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువవుతోందని అన్నారు. విజయసాయిరెడ్డిలో మార్పు కనిపిస్తోందని... గత 2 నెలల నుంచి ఆయన చేస్తున్న ట్వీట్లలో కూడా మార్పు ఉందని చెప్పారు.
నందమూరి తారకరత్న చిన్న వయసులోనే మృతి చెందడం బాధాకరమని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. తారకరత్న విషయంలో లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలు సరికాదని... సాక్షి పేపర్లో దరిద్రపు రాతలు రాస్తున్నారని మండిపడ్డారు. ప్రాణాలు కోల్పోయిన తారకరత్నను స్వార్థ రాజకీయాల కోసం ఇన్ని రోజులు ఆసుపత్రిలో ఉంచారని లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.