Bhagat Singh Koshyari: పెళ్లి కొడుకు లేకుండా పెళ్లి ఎలా సాధ్యం?: మహారాష్ట్ర మాజీ గవర్నర్ కోష్యారీ

Didnt act under pressure govt falls in other states too says Bhagat Singh Koshyari
  • శివసేన ముక్కలు, మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై స్పందించిన భగత్ సింగ్ కోష్యారీ
  • నాడు మహారాష్ట్రలో అంతా రాజ్యాంగం ప్రకారమే జరిగిందని వెల్లడి 
  • ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఒక్కరు కూడా లేఖ ఇవ్వలేదని వ్యాఖ్య
  • ఉద్ధవ్ థాకరే వద్ద మెజారిటీ ఉండి ఉంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పాల్సిందన్న మాజీ గవర్నర్ 
శివసేన ముక్కలు కావడం, మహారాష్ట్రలో తలెత్తిన రాజకీయ సంక్షోభంపై మాజీ గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ స్పందించారు. తాను గవర్నర్ గా ఉన్న సమయంలోనే మహారాష్ట్రలో ఇవి జరగడంపై నోరు విప్పారు. ఓ న్యూస్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోష్యారీ మాట్లాడుతూ.. మహారాష్ట్రలో ఏది జరిగినా అది రాజ్యాంగం ప్రకారమే జరిగిందని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

బీజేపీ-షిండే కూటమికి మద్దతుగా నిలిచారన్న ఆరోపణలపై కోష్యారీ స్పందించారు. ‘‘నాడు సీఎంగా ఉన్న ఉద్ధవ్ థాకరే వద్ద మెజారిటీ ఉండి ఉంటే.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని నా దగ్గరికి రావాల్సింది. కానీ ఆయన వెనకడుగు వేశారు. ఏమీ మాట్లాడలేదు. దీంతో మరో పార్టీ వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పింది.. చేసింది. రాజ్యాంగం ప్రకారమే అంతా జరిగింది’’ అని వివరించారు.

‘‘పెళ్లి కొడుకు ఎక్కడ అని నేను అడిగాను. కానీ పెళ్లికొడుకు లేకుండానే పెళ్లి చేసుకోవాలని వాళ్లు అనుకున్నారు. అది ఎలా సాధ్యం? అని ప్రఫుల్ పటేల్, శరద్ పవార్, ఛగన్ భుజ్ బల్ (ఎన్సీపీ నేతలు)ను అడిగాను. అయినా ఒక్కరు కూడా.. ప్రభుత్వ ఏర్పాటుకు మెజారిటీ ఉందని లేఖ ఇవ్వలేదు. శివ సైనికుడిని సీఎం చేయాలని అనుకుంటున్నామని మాత్రం చెప్పుకుంటూ వచ్చారంతే’’ అని కోష్యారీ వివరించారు.

2019లో దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ తో తెల్లవారుజామునే ప్రమాణస్వీకారాలు చేయించిన ఘటనలో తన పాత్ర ఏమీ లేదని చెప్పారు. ‘‘తమకు మెజారిటీ ఉందని ఫడ్నవీస్ నాడు చెప్పారు. ఆ తర్వాతే రాజ్ భవన్ లో కార్యక్రమం జరిగింది. అంతే తప్ప గవర్నర్ గా నాపై ఒత్తిడి ఏమీ లేదు’’ అని వివరించారు.
Bhagat Singh Koshyari
Maharashtra
Shiv Sena
NCP
BJP
Uddhav Thackeray
Sharad Pawar

More Telugu News