Smrithi Mandhana: స్మృతి మంధన సూపర్ ఇన్నింగ్స్... టీమిండియా 155/6
- దక్షిణాఫ్రికాలో మహిళల టీ20 ప్రపంచకప్
- టీమిండియా వర్సెస్ ఐర్లాండ్
- మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా
- 56 బంతుల్లో 87 పరుగులు చేసిన స్మృతి
- లక్ష్యఛేదనలో ఐర్లాండ్ విలవిల
- 2 పరుగులకే 2 వికెట్లు డౌన్
మహిళల ప్రపంచకప్ లో భాగంగా ఐర్లాండ్ తో కీలక మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్ స్మృతి మంధన విజృంభించింది. స్మృతి మంధన 56 బంతుల్లోనే 87 పరుగులు చేయడం విశేషం. ఆమె స్కోరులో 9 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. మరో ఎండ్ లో ఇతర బ్యాటర్లు చెప్పుకోదగ్గ స్కోర్లు చేయకపోవడంతో భారత్ కు భారీ స్కోరు సాధ్యం కాలేదు. మొత్తమ్మీద నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా 6 వికెట్లకు 155 పరుగులు చేసింది.
యువ బ్యాటర్ షెఫాలీ వర్మ 24, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 13, జెమీమా రోడ్రిగ్స్ 19 పరుగులు చేశారు. రిచా ఘోష్, దీప్తి శర్మ డకౌట్ అయ్యారు. ఐర్లాండ్ బౌలర్లలో కెప్టెన్ లారా డెలానీ 3 వికెట్లు తీసింది. ఓర్లా ప్రెండెర్ గాస్ట్ 2, ఆర్లెన్ కెల్లీ 1 వికెట్ పడగొట్టారు.
అనంతరం, 156 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఐర్లాండ్ ను టీమిండియా ఆదిలోనే దెబ్బకొట్టింది. తొలుత ఓపెనర్ అమీ హంటర్ ను రనౌట్ రూపంలో తిప్పి పంపింది. ఆ తర్వాత, పేసర్ రేణుకా సింగ్ విజృంభించడంతో ఐర్లాండ్ వన్ డౌన్ బ్యాటర్ ఓర్లా ప్రెండెర్ గాస్ట్ డకౌట్ అయింది. దాంతో ఐర్లాండ్ 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.