Varla Ramaiah: కారు తగలబెడితే నో కేస్... సామగ్రి ధ్వంసం చేస్తే నో కేస్: వర్ల రామయ్య
- గన్నవరం ఘటనపై టీడీపీ నేతల ఆగ్రహం
- పోలీసులది ప్రేక్షకపాత్ర అంటూ వర్ల రామయ్య విమర్శలు
- పోలీసులు ఓరియెంటేషన్ క్లాసులకు హాజరు కావాలని హితవు
- వంశీ వెన్ను విరవడం తథ్యమన్న ధూళిపాళ్ల నరేంద్ర
గన్నవరంలో టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన ఘటనపై వర్ల రామయ్య స్పందించారు. గన్నవరం ఘటనలో పోలీసులది ప్రేక్షక పాత్ర అని విమర్శించారు. కారును తగలబెడితే నో కేస్... సామగ్రి ధ్వంసం చేస్తే నో కేస్ అని సినీ ఫక్కీలో వ్యాఖ్యానించారు.
లా అండ్ ఆర్డర్ ను కాపాడడంలో పోలీసులు విఫలమయ్యారని వర్ల రామయ్య ఆరోపించారు. పోలీసులు ఓరియెంటేషన్ క్లాసులకు హాజరు కావాలని హితవు పలికారు. రౌడీ షీటర్లను కట్టడి చేయలేని దుస్థితిలో పోలీసులు ఉన్నారని విచారం వ్యక్తం చేశారు.
గన్నవరం ఘటన నేపథ్యంలో, ధూళిపాళ్ల నరేంద్ర కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యాలయంపై దాడి దుర్మార్గమని పేర్కొన్నారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే వంశీ వెన్ను విరవడం తథ్యమని హెచ్చరించారు. చంద్రబాబు పేరుతో గెలిచి ఆయనపైనే విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు. ఏపీలో జగన్ మోహన్ రెడ్డి రాక్షస పాలన సాగిస్తున్నారని ధూళిపాళ్ల విమర్శించారు.
ప్రశ్నించిన వారికి కత్తులతో సమాధానం చెప్పడం ఆటవిక పాలన అని వ్యాఖ్యానించారు. గూండాలు, రౌడీలు చెలరేగిపోవడానికి జగనే కారణమని ఆరోపించారు. కార్లు, ఫర్నిచర్ ధ్వంసం చేయడం వంశీ పశు సంస్కృతికి నిదర్శనం అని విమర్శించారు. నెత్తిన రూపాయి పెడితే పావలాకు అమ్ముడుపోని దద్దమ్మ వంశీ అని ఎద్దేవా చేశారు.