Vallabhaneni Vamsi: నేను ఎవరి జోలికి వెళ్లను... నా జోలికి వస్తే వదలను: వల్లభనేని వంశీ
- గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి
- వంశీపై మండిపడుతున్న టీడీపీ నేతలు
- గన్నవరంలో ప్రతి ఘటనకు నాకేంటి సంబంధం అన్న వంశీ
- బయటి వాళ్లు వచ్చి గొడవ చేశారని వ్యాఖ్యలు
- తాను ఎవరిపైనా ఫస్ట్ అటాక్ చేయనని వెల్లడి
గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో తనపై జరుగుతున్న ప్రచారం పట్ల ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పందించారు. బయటి వాళ్లు వచ్చి గన్నవరంలో గొడవ చేశారని, కేవలం తన అనుచరులే దాడికి దిగారంటూ ఓ వర్గం మీడియా ప్రచారం చేస్తోందని అన్నారు. బయటివాళ్లు ఇక్కడికి వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏంటని వంశీ ప్రశ్నించారు. గన్నవరంలో జరిగే ప్రతి ఘటనతో నాకేంటి సంబంధం? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాను ఎవరిపైనా ఫస్ట్ అటాక్ చేయనని, తన జోలికి వస్తే మాత్రం వదలనని స్పష్టం చేశారు. తానే కాదు, కొడాలి నాని కూడా ఇలాగే వ్యవహరిస్తాడని తెలిపారు. సంకల్పసిద్ధి కేసుతో తనకు ఎలాంటి సంబంధంలేదని, న్యాయం తనవైపే ఉందని స్పష్టం చేశారు.
చంద్రబాబు చరిత్ర తనకు, కొడాలి నానికి తెలుసని, అందుకే వారి నేతలను తమపై ఉసిగొల్పుతున్నాడని వంశీ మండిపడ్డారు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని, మామూలు విషయాలకు కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారని తెలిపారు.
చంద్రబాబు ప్రజల కంటే ఎక్కువగా మీడియాను, సోషల్ మీడియాను నమ్ముకుంటాడని, చంద్రబాబు చేయగలిగిన ఏకైక పని గుడ్డకాల్చి ముఖంపై వేయడమేనని, అందులో ఆయన సిద్ధహస్తుడని విమర్శించారు. కొడాలి నాని, తాను కూడా చేతులు కట్టుకుని ఏమీ లేమని, తాము కూడా ఆ స్కూలు నుంచి వచ్చిన వాళ్లమేనని వంశీ హెచ్చరించారు.