Andhra Pradesh: రాష్ట్రంలో బీసీలను తలెత్తుకునేలా చేశారు.. సీఎం జగన్ పై మంత్రి జోగి రమేశ్ పొగడ్తల వర్షం

Ap minister jogi ramesh fires on chandrababu and lokesh
  • బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు జగన్ వెన్నంటే ఉన్నారని వ్యాఖ్య
  • జగన్ హయాంలోనే బలహీన వర్గాలకు న్యాయం జరిగిందని వెల్లడి
  • బడుగులపై చంద్రబాబు, లోకేశ్ లు విషం కక్కుతున్నారని ఫైర్
ఆంధ్రప్రదేశ్ లో బీసీలను తలెత్తుకునేలా చేశారంటూ సీఎం జగన్ పై మంత్రి జోగి రమేశ్ పొగడ్తల వర్షం కురిపించారు. సామాజిక న్యాయం అంటే ఏమిటనేది జగన్ చేసి చూపించారని అన్నారు. సీఎం జగన్ తోనే సామాజిక న్యాయం సాధ్యమని తేల్చిచెప్పారు. ఈమేరకు మంత్రి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. 75 ఏళ్ల దేశ చరిత్రలో ఏపీలో మాత్రమే సామాజిక న్యాయం జరిగిందని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతీ ఇంట్లో సంక్షేమం, అభివృద్ధి వెల్లివిరుస్తున్నాయని అన్నారు.

వైసీపీ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రభుత్వమని, జగన్ పాలనలో బలహీన వర్గాలు ఎవరెస్ట్ ఎక్కినంత సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. రిజర్వేషన్లు లేకపోయినా సరే బలహీన వర్గాలకు ఎక్కువ పదవులు ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనని మంత్రి జోగి రమేశ్ తెలిపారు. వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్దిదారుల ఖాతాల్లో నేరుగా రూ.2 లక్షల వరకు నగదు జమ చేశారని వివరించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్ విషం కక్కుతున్నారని మంత్రి మండిపడ్డారు.

లోకేశ్ తన స్థాయికి మించి విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ నుంచి పారిపోయిన చంద్రబాబు.. రోడ్లపైకి చేరి ఏదేదో మాట్లాడుతున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. బలహీన వర్గాలకు ఏ ప్రభుత్వం న్యాయం చేసిందో, ఎవరి హయాంలో సామాజిక న్యాయం జరిగిందో చర్చించేందుకు రావాలంటూ చంద్రబాబుకు జోగి రమేశ్ సవాల్ విసిరారు. టీడీపీ ఎవరితో పొత్తులు పెట్టుకున్నా జనం పట్టించుకోరని మంత్రి తేల్చిచెప్పారు.
Andhra Pradesh
Jogi Ramesh
Jagan
ycp govt
minorities

More Telugu News