Nara Lokesh: ఎంత సతాయిస్తే అంత మాట్లాడతా: లోకేశ్
- గత నెల 27న ప్రారంభమైన యువగళం పాదయాత్ర
- ప్రస్తుతం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పాదయాత్ర
- తొండమానుపురం వద్ద 300 కిమీ పూర్తి
- 13 గ్రామాల దాహార్తి తీర్చుతానని లోకేశ్ ప్రకటన
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు నేడు 23వ రోజు కాగా, పాదయాత్ర 300 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొండమానుపురం పంచాయతీలో యువగళం పాదయాత్ర మంగళవారం 300 కిలోమీటర్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ఈ పంచాయతీ పరిధిలో 13 గ్రామాల దాహార్తి తీర్చే రక్షిత మంచి పథకాన్ని టీడీపీ ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లో ఏర్పాటు చేస్తానని లోకేశ్ ప్రకటించారు.
పాదయాత్ర ప్రారంభం అయ్యాక ప్రతి 100 కిలోమీటర్ల మైలురాయిని చేరుకోగానే, లోకేశ్ ఏదో ఒక పథకంపై ప్రజలకు స్పష్టమైన ప్రకటన చేయడాన్ని ఆనవాయతీగా మార్చుకున్నారు.
కొబ్బరికాయ కొట్టటానికి వంగలేనోడు కుర్రాడా?
కడప ఉక్కు ఫ్యాక్టరీ శంకుస్థాపనకి వెళ్లిన సీఎం జగన్ రెడ్డి కొబ్బరికాయ కొట్టటానికి వంగలేకపోయాడని లోకేశ్ ఎద్దేవా చేశారు. తొండమానుపురంలో ప్రజల్ని ఉద్దేశించి లోకేశ్ మాట్లాడుతూ... "కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకి వెళ్లి వంగి కొబ్బరి కాయ కొట్టలేని జగన్ తాను కుర్రాడినంటాడు. 72 ఏళ్ల వయస్సులో 27 ఏళ్ల కుర్రాడిలా పరుగులు పెట్టే చంద్రబాబు గారిని ముసలాడు అంటాడు" అని విమర్శించారు.
ప్రజల ఆశీస్సులతో 300 కిలోమీటర్లు!
"ప్రజల ఆశీస్సులతో 300 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తయ్యింది. ఇక్కడి ప్రజల తాగునీటి సమస్య తీర్చేందుకు టిడిపి అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజుల్లో తాగునీటి పథకం పూర్తి చేసి ఇంటింటికీ కొళాయి వేసి ఉచితంగా నీరు అందిస్తాం. మైక్ పట్టుకుని మాట్లాడొద్దని జీవో నెం.1లో ఉంది. నా చేతిలో మైకు లేదు. ఎందుకు భయపడుతున్నారు. స్టూలు పట్టుకుపోతే మరో స్టూలు పట్టుకొస్తాం"
జగన్ పతనం మొదలైంది!
"అనపర్తిలో చంద్రబాబు గారి సభకి అనుమతి ఇచ్చి మళ్లీ రద్దుచేసి చీకట్లో 7 కిలోమీటర్లు నడిపించారు. జగన్ పతనం మొదలు అయ్యింది. జగన్ పని అయిపోయింది. ఎంత సతాయిస్తే అంత మాట్లాడతా. సాఫీగా సాగనిస్తే పాదయాత్ర- అడ్డుకుంటే దండయాత్ర. చట్టవ్యతిరేక జీవో నెం.1ని మేము వ్యతిరేకించినా చట్టాలని గౌరవిస్తాం"
పంటకు గిట్టుబాటు ధర లేదు!
తొండమానుపురంలో వరి పొలంలో పురుగుల మందు పిచికారి చేస్తున్న రైతులతో లోకేశ్ కొద్దిసేపు ముచ్చటించి వారి సాదకబాధకాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు తమ గోడు విన్పిస్తూ... విత్తనం దగ్గర నుండి పురుగుల మందులు, ఎరువుల వరకూ రెట్లు విపరీతంగా పెరిగిపోయాయని, నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల వలన తీవ్రంగా నష్టపోతున్నామని వాపోయారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదని ఆవేదన వ్యక్తంచేశారు.
అందుకు లోకేశ్ స్పందిస్తూ... "రైతు రాజ్యం తెస్తానని జగన్మోహన్ రెడ్డి రైతు లేని రాజ్యం తెస్తున్నారు. పురుగుల మందు కొడితే పురుగులు చావడం లేదు. జగన్ బ్రాండ్ మద్యం కొడితే పురుగులు కచ్చితంగా చస్తాయి. 3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అన్నారు. ఆ నిధి ఏమైంది? టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అందిస్తాం. పెట్టుబడి తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటి చేస్తాం" అని భరోసా ఇచ్చారు.
గ్యాస్ ధరలు పెరిగాయి, సబ్సిడీ రావడంలేదు!
తొండమానుపురం గ్రామంలో గ్యాస్ సిలిండర్ తీసుకోవడానికి వచ్చిన మహిళలతో లోకేశ్ మాట్లాడారు. నిత్యావసర సరుకుల ధరలు, గ్యాస్ ధర విపరీతంగా పెరిగిపోయాయని,. గతంలో గ్యాస్ కి ఇచ్చిన సబ్సిడీ కూడా రావడం లేదని మహిళలు తెలిపారు. పన్నులు విపరీతంగా పెరిగిపోయాయని, కరెంట్ ఛార్జీలు, చెత్త పన్ను, ఇంటి పన్ను అంటూ ముక్కు పిండి వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఆదాయాలు మాత్రం పెరగడంలేదని మహిళలు ఆవేదన వ్యక్తంచేశారు.
అందుకు లోకేశ్ స్పందిస్తూ... వైసీపీ ప్రభుత్వం వేస్తున్న పన్నుల వలనే నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని వెల్లడించారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే పన్నుల భారం తగ్గించడానికి ప్రత్యేక ప్రణాళిక సిద్దం చేస్తామని హామీ ఇచ్చారు.
ఇస్లామిక్ బ్యాంక్ ను మేనిఫెస్టోలో పెడతాం!
ముస్లింల సంక్షేమం కోసం ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటుచేస్తామని, ఈ విషయాన్ని మేనిఫెస్టోలో పొందుపరుస్తామని లోకేశ్ పేర్కొన్నారు. శ్రీకాళహస్తి 23వరోజు పాదయాత్రకు బయలుదేరముందు ముస్లిం సామాజిక వర్గీయులతో ఆయన ముఖాముఖి సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... "పాదయాత్రలో జగన్ ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు..అమలు చేయలేదు. కానీ మేము ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాం. మేనిఫెస్టోలో పెడతాం" అని హామీ ఇచ్చారు.
"రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం వచ్చాక ముస్లింలపై దాడులు పెరిగాయి. ముస్లింలు భయంతో బతుకుతున్నారు. రోజుకో భూమిని కబ్జా చేస్తుంటే భూములు ఎక్కడ మిగులుతాయి.? మైనారిటీలకు ఇచ్చిన భూములు లాక్కుంటే ఎలా.? బియ్యపు మధుసూదన్ రెడ్డి బడా చోర్. ముస్లింల సంక్షేమ కార్యక్రమాలు కుదించింది జగనే" అని పేర్కొన్నారు.
మహిళా రెసిడెన్షియల్ కాలేజి ఏర్పాటుచేస్తాం!
"గతంలో ఈ ప్రాంతంలో ముస్లిం విద్యార్థినులకు రెసిడెన్షియల్ కాలేజీ కేటాయించి, పనులు ప్రారంభిస్తే ఈ ప్రభుత్వం నిలిపేసింది. ముస్లింలు ఎక్కువగా ఉన్న పార్లమెంట్ పరిధిలో మహిళా రెసిరెన్షియల్ కాలేజీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఆ పని కూడా చేస్తాం. తిరుపతి పార్లమెంట్ లో మహిళలకు రెసిరెన్షియల్ కాలేజీ ఏర్పాటు చేస్తాం"
టీడీపీ అధికారంలోకి వచ్చాక బీసీ కార్పొరేషన్ల పునర్నిర్మాణం
టీడీపీ అధికారంలోకి వచ్చాక బీసీ కార్పొరేషన్ల పునర్నిర్మాణం చేస్తామని, ఆర్థికంగా బీసీలను ముందుకు తీసుకెళ్తామని లోకేశ్ పేర్కొన్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం బండారుపల్లిలో వన్యకుల క్షత్రియులతో లోకేశ్ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... "జగన్ రెడ్డి వన్యకుల క్షత్రియులకు ఏం ఒరగబెట్టాడు? కనీసం ఒక్క లోన్ అయినా ఇచ్చాడా? లేదు. సత్యపాల్ కమిటీ నివేదికను ఆధారంగా చేసుకుని మీ సమస్యను పరిష్కరిస్తాం. మీ పథకాలు రద్దు చేసిన వారిని మీరు నిలదీసి అడగండి... పోరాడండి. మీకు టీడీపీ అన్ని వేళలా అండగా ఉంటుంది" అని స్పష్టం చేశారు.
మన రోడ్ల పైనే వైసీపీ నేతల నడక!
"నేను మంత్రిగా ఉన్నప్పుడు 25వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు, లక్షలాది ఎల్ఈడీ లైట్లు వేశాం. నేడు వైసీపీ వాళ్లంతా మనం వేసిన రోడ్ల మీద, మనం వేసిన లైట్ల వెలుతురులో నడుస్తున్నారు. వైసీపీ పాలనలో వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కోర్టులో దొంగతనం చేసి సీబీఐ గొడవల్లో చిక్కుకుని రైతుల సంక్షేమాన్ని గాలికొదిలేశారు. టీడీపీ పాలనలో అన్ని ప్రాంతాల్లో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహించారు. నేడు గోపాల మిత్రలకు వేతనాలు కూడా జగన్ రెడ్డి ఇవ్వడం లేదు. పశువులకు వైసీపీ పాలనలో వైద్యం ఖర్చులు పెరిగిపోయాయి. రైతాంగాన్ని మేం పూర్తిస్థాయిలో ఆదుకుంటాం"
యువగళం పాదయాత్ర వివరాలు...
ఇప్పటి వరకు నడిచిన దూరం 312.5 కి.మీ.
యువగళం పాదయాత్ర 24వ రోజు షెడ్యూల్(22-2-2023)
ఉదయం
8.00 – కోబాక విడిది కేంద్రం నుండి పాదయాత్ర ప్రారంభం.
8.45 – కొత్త వీరాపురంలో స్థానికులతో మాటామంతీ.
మధ్యాహ్నం
12.00 - మడిబాకలో రైతులతో ముఖాముఖి సమావేశం.
1.00 – మడిబాకలో భోజన విరామం.
సాయంత్రం
3.30 – మునగలపాలెంలో స్థానికులతో సమావేశం.
4.40 – వికృతమాలలో స్థానికులతో మాటామంతీ.
5.45 – పాపానాయుడుపేటలో కైకాల సామాజిక వర్గీయులతో ముఖాముఖి.
6.40 – రేణిగుంట మండలం జీలపాలెం విడిది కేంద్రంలో బస.