Ap Govt: ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెట్టే ఉద్యోగులపై చర్యలు అంటూ ప్రచారం.. ప్రభుత్వ వివరణ!
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సర్క్యులర్ ఫొటోలు
- రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులలో భయాందోళనలు
- తప్పుడు ప్రచారమేనని తేల్చిచెప్పిన ఏపీ ప్రభుత్వం
సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టే ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలు తప్పవంటూ ఆంధ్రప్రదేశ్ లో ప్రచారం జరుగుతోంది. ఇలాంటి ఉద్యోగులను గుర్తించి సాధారణ పరిపాలన శాఖకు పంపాలంటూ ఉత్తర్వులు కూడా జారీ అయ్యయాని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ గా మారాయి. దీంతో రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులలో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ ప్రచారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. ఫ్యాక్ట్ చెక్.ఏపీ.జీఓవీ.ఇన్ అనే ట్విట్టర్ పేజీ ద్వారా క్లారిటీ ఇచ్చింది. ఈ ప్రచారంలో నిజంలేదని, అలాంటి ఉత్తర్వులు ఏవీ ప్రభుత్వం జారీ చేయలేదని స్పష్టం చేసింది.
వైరల్ గా మారిన పోస్టుల్లోని సర్క్యులర్ గతంలో జమ్మూకశ్మీర్ ప్రభుత్వం జారీచేసినదని తేల్చిచెప్పింది. గతంలో జమ్మూకశ్మీర్ ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ ను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారని ఏపీ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యోగుల్లో వ్యతిరేకత పెంచేందుకు కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఇలాంటి వదంతులను ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారానికి పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ప్రభుత్వం ఈ సందర్భంగా హెచ్చరించింది.