COVID19: కొవిడ్ భయంతో మూడేళ్లపాటు కుమారుడితో కలిసి గదిలో బందీ అయిన తల్లి!

 Covid scared woman keeps herself child locked in home for 3 years
  • కొవిడ్ మొదటి వేవ్ నుంచి బయటకు రాని మహిళ
  • రెండో వేవ్ సమయంలో భర్తను ఇంట్లోకి రానివ్వకుండా తాళం వేసుకున్న భార్య
  • మూడేళ్లుగా ఇంట్లోనే ఉండడంతో గదిలో పేరుకుపోయిన చెత్తాచెదారం
  • తల్లీకుమారులను ఆసుపత్రికి తరలించిన పోలీసులు
కరోనా భయంతో మూడేళ్లపాటు పదేళ్ల కుమారుడితో కలిసి గదిలో మగ్గిపోయిన ఓ మహిళ(35)ను పోలీసులు రక్షించారు. గురుగ్రామ్‌లో జరిగిందీ ఘటన. తల్లీకుమారులను రక్షించిన పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు మహిళ పోలీసులతో వాగ్వివాదానికి దిగింది. తమను అక్కడి నుంచి తరలించాలని ప్రయత్నిస్తే కుమారుడిని చంపేస్తానని బెదిరించింది. అయితే, శిశు సంరక్షణ బృందంతో కలిసి పోలీసులు చాకచక్యంగా వారిని ఇంటి నుంచి ఖాళీ చేయించారు. మూడేళ్లుగా తల్లీకుమారులు ఇద్దరూ బయటకు రాకపోవడంతో వారి గదిలో చెత్త పేరుకుపోయినట్టు అధికారులు తెలిపారు. 

భార్య ప్రవర్తనపై ఆమె భర్త గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ అది కుటుంబ వ్యవహారం కాబట్టి పోలీసులు జోక్యం చేసుకోలేదు. తాజాగా మరోమారు ఆయన పోలీసులను కలిసి విషయం చెప్పడంతో స్పందించి, వారిని రక్షించారు. తన భార్యకు మతి స్థిమితం సరిగా లేదని ఆయన చెప్పడంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. 
 
దర్యాప్తులో అనేక ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. కొవిడ్ తొలిసారి పంజా విసిరినప్పటి నుంచీ ఆ కుటుంబం ఇంటి లోపలే బందీగా ఉన్నట్టు తేలింది. కొవిడ్ సెకండ్ వేవ్ సమయంలో భర్తను ఇంట్లోకి రాకుండా అడ్డుకున్న మహిళ.. విధుల కోసం అతడు బయటకు వెళ్లిన తర్వాత ఇంటికి లోపలి నుంచి తాళం వేసుకుంది. దీంతో అతడు చక్కర్‌పూర్‌లో మరో గదిని అద్దెకు తీసుకుని ఏడాదిన్నరగా ఉంటున్నాడు. తాజాగా, అతడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు తల్లీకుమారులను రక్షించి ఆసుపత్రికి తరలించారు.
COVID19
Corona Virus
Gurugram

More Telugu News