Secunderabad: బెలగావి ఎక్స్‌ప్రెస్ రైలులో బాంబు పెట్టినట్టు మాట్లాడుకున్న ముగ్గురు వ్యక్తులు.. విని పోలీసులకు సమాచారమిచ్చిన ఆటో డ్రైవర్!
- రాత్రి 10.20 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరాల్సిన రైలు
- ఫోన్ కాల్ రావడంతో రైలును క్షుణ్ణంగా పరిశీలించి బాంబు లేదని తేల్చిన పోలీసులు
- రాత్రి 11.36 గంటలకు బయలుదేరిన రైలు
- సమాచారమిచ్చిన వ్యక్తిని విచారిస్తామన్న పోలీసులు
సికింద్రాబాద్ నుంచి బెలగావి వెళ్లాల్సిన ఎక్స్‌ప్రెస్ రైలులో బాంబు పెట్టినట్టు ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటుండగా విన్న ఓ ఆటో డ్రైవర్ పోలీసులకు సమాచారం అందించాడు. అప్రమత్తమైన పోలీసులు డాగ్‌స్క్వాడ్, బాంబు స్క్వాడ్లతో రైలులో తనిఖీ చేపట్టారు. రాత్రి 11.15 గంటల వరకు రైలును క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు బాంబు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
సికింద్రాబాద్-బెళగావి ఎక్స్‌ప్రెస్ రైలు (07335/36) గత రాత్రి 10.20 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరాల్సి ఉంది. అయితే, బాంబు తనిఖీల కారణంగా రైలు ఆలస్యంగా 11.36 గంటలకు బయలుదేరింది.
సంగారెడ్డి జిల్లా దేవరంపల్లి గ్రామానికి చెందిన బాలరాజు ఆటోడ్రైవర్. సమీపంలోని పోలీస్ స్టేషన్ వద్ద ముగ్గురు సికింద్రాబాద్-బెలగావి రైలులో బాంబు ఉందని మాట్లాడుకోవడం విన్నాడు. వెంటనే ఆయన పోలీసులకు సమాచారం అందించాడు. కాగా, ఫోన్ చేసి సమాచారమిచ్చిన బాలరాజును విచారించనున్నట్టు పోలీసులు తెలిపారు.