Rohit Sharma: ఆ బ్యాట్స్ మన్ లావు తగ్గాలన్న లెజెండరీ క్రికెటర్
- రోహిత్ తన ఫిట్ నెస్ ను మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందన్న కపిల్ దేవ్
- టీవీలో చూస్తుంటే లావుగా కనిపిస్తున్నాడని వ్యాఖ్య
- విరాట్ కోహ్లీలా ఫిట్ గా ఉండాలని సూచన
అత్యంత నైపుణ్యం ఉన్న బ్యాట్స్ మన్ లలో ఒకడిగా టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మకు పేరుంది. ఇదే సమయంలో బద్ధకం ఎక్కువనే అపవాదూ ఉంది. దీనికి తన ఆటతోనే బదులిచ్చాడతను. అయితే పెరుగుతున్న వయసుకు తగ్గట్లుగా ఫిట్ నెస్ కాపాడుకోవడం లేదనే విమర్శలు రోహిత్ పై ఉన్నాయి. ఇదే విషయంపై టీమిండియా లెజెండ్ కపిల్ దేవ్ స్పందించారు.
రోహిత్ శర్మను టీవీలో చూస్తున్నప్పుడు లావుగా కనిపించాడని, అతడు తన ఫిట్ నెస్ ను మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందని కపిల్ దేవ్ అన్నారు. బరువు తగ్గేందుకు రోహిత్ వర్కౌట్స్ చేయాలని సూచించారు.
ఓ వార్తా సంస్థతో కపిల్ మాట్లాడుతూ.. ‘‘ఫిట్ గా ఉండటం చాలా ముఖ్యం. కెప్టెన్ కు ఇంకా ముఖ్యం. మీరు ఫిట్ గా లేకుంటే అది అవమానకరం. అందుకే రోహిత్ కొంత కష్టపడాలి. అతను గొప్ప క్రికెటర్. గొప్ప కెప్టెన్. కానీ అతడి ఫిట్ నెస్ విషయానికి వస్తే మాత్రం.. టీవీలో లావుగా కనిపిస్తున్నాడు. విరాట్ కోహ్లీలా ఫిట్ గా ఉండాలి’’ అని సూచించారు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో తొలి రెండు మ్యాచ్ ల్లో టీమిండియా ఘన విజయం సాధించింది. ట్రోఫీని నిలబెట్టుకుంది. మూడో టెస్టు మార్చి 1 నుంచి ప్రారంభం కానుంది.